WhatsApp Governance : వాట్సాప్ పాలన
ABN, Publish Date - Jan 31 , 2025 | 03:22 AM
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-మన మిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను గురువారం మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
9552300009 నంబర్ కేటాయింపు ‘మన మిత్ర’ పేరుతో పౌర సేవలకు సరికొత్త వేదిక
ప్రారంభించిన లోకేశ్.. 161 సేవలు అందుబాటులోకి
భవిష్యత్తులో 500లకు పైగా ప్రభుత్వ సేవలు
కుల ధ్రువీకరణ పత్రాలూ పొందవచ్చు.. సర్టిఫికెట్ల విశ్వసనీయతకు ఢోకా లేదు.. నకిలీల్లేకుండా క్యూఆర్ కోడ్
రియల్‌టైమ్‌లో సమస్యల పరిష్కారం
పాదయాత్రలోని హామీని నెరవేరుస్తున్నా: మంత్రి లోకేశ్
ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం : సీఎం
ప్రభుత్వంతో ప్రజలు నేరుగా అనుసంధానమై సమస్యలు పరిష్కరించుకునే సరికొత్త వేదిక వాట్సాప్ గవర్నెన్స్. పాదయాత్ర చేసినపుడు ప్రజా సమస్యల్లో ఎక్కువగా ధ్రువీకరణ పత్రాలపైనే విన్నాను. ప్రజలకు సులువుగా, వేగంగా సేవలు అందించడానికే వాట్సాప్ గవర్నెన్స్‌కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కుల ధ్రువీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల వరకూ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ప్రజల చేతిలో ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, ప్రజా ప్రభుత్వం నినాదంతో వాట్సాప్ పాలనను అందుబాటులోకి తెస్తున్నాం
- మంత్రి నారా లోకేశ్
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సాంకేతిక సహకారంతో దేశంలోనే తొలిసారిగా సరికొత్త పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-మన మిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను గురువారం మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అధికారికంగా 9552300009 అనే వాట్సాప్ నంబర్‌ను కేటాయించింది. మొదటి దశలో 161 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో 500పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఎదురైతే, చట్టాలను కూడా దానికి అనుగుణంగా మారుస్తామన్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా వాట్సాప్ గవర్నెన్స్ నిలుస్తుందని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల వరకు వాట్సాప్ ద్వారా సులువుగా పొందవచ్చన్నారు.
మన మిత్ర ద్వారా పొందే సర్టిఫికెట్ల విశ్వసనీయతకు ఢోకాలేదన్నారు. ప్రతి సర్టిఫికేట్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా చాటింగ్‌ను ప్రారంభించవచ్చన్నారు. ప్రజా సమస్యలను కూడా వాట్సాప్ నంబర్‌కు తెలపవచ్చన్నారు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలు స్పందించి పరిష్కరిస్తాయని వెల్లడించారు.
సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడకూడదనే..
ధ్రువపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చామని లోకేశ్ వెల్లడించారు.. ఒక్క బటన్ నొక్కి సినిమా చూస్తున్నామని, భోజనం తెప్పించుకుంటున్నామని, క్యాబ్ వస్తోందని, అలాంటప్పుడు ప్రభుత్వ సేవలు పౌరుల వద్దకు ఎందుకు తీసుకువెళ్లకూడదన్న ఆలోచనతోనే గతేడాది అక్టోబరులో మెటాతో ఒప్పందం చేసుకుని వాట్సాప్ పరిపాలనను ప్రారంభించామని లోకేశ్ వెల్లడించారు.
సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫాం పైకి..
ప్రభుత్వ శాఖల సేవలన్నీ ఒకే ‘ఫ్లాట్‌ఫాం’ పైకి తీసుకువచ్చేందుకే వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చామని మంత్రి లోకేశ్ తెలిపారు. ధ్రువీకరణ పత్రాలపై క్యూఆర్ ఉంటుందని, దాని వల్ల నకిలీలకు ఆస్కారం ఉండదని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే విద్యార్హత సర్టిఫికెట్లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్‌సైట్‌కు ఆ లింక్ వెళ్తుందని.. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదని చెప్పారు. ఈ ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానాలూ ఆమోదిస్తాయన్నారు. వాట్సా్‌పలో ప్రభుత్వ సేవలు రియల్ టైౖమ్‌లో అందిస్తామన్నారు. 80 నుంచి 90 శాతం పౌర సేవలు వెనువెంటనే అమలు చేస్తామని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకొస్తామన్నారు. రెండో దశలో ఏఐ బాట్, వాయిస్ ద్వారా కూడా అమలుచేస్తామన్నారు. ప్రపంచంలోనే వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదేనని చెప్పారు. ఉండవల్లి ప్రజా వేదికలో జరిగిన మన మిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్‌టీజీఎస్, ఐటీ శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్, మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్య దేవనాథన్, వాట్సాప్ డైరెక్టర్, ఇండియా హెడ్ రవి గార్గ్, ఆర్‌టీజీఎస్ సీఈవో దినేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంధ్య దేవనాథన్ మాట్లాడుతూ.. ప్రజలు సులభంగా వినియోగించేలా వాట్సాప్ గవర్నెన్స్‌ను రూపొందించామన్నారు.ఏపీ ప్రభుత్వంతో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రవి గార్గ్ మాట్లాడుతూ.. సింగిల్ ప్లాట్‌ఫాంపై అన్ని రకాల ేసవలు అందించడం దేశంలో ఎక్కడా లేదు. హాయ్ అని టైప్ చేయడం ద్వారా ప్రజలు సులభంగా పౌర సేవలు పొందవచ్చని అన్నారు.
ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ‘మన మిత్ర.. ప్రజల చేతిలో ప్రభుత్వం’ కార్యక్రమం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల డేటాను సురక్షితంగా.. భద్రంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్, మెటా ఇండియా ఉపాధ్యక్షురాలు సంధ్య దేవనాథన్, డైరెక్టర్ రవిగార్గ్, మెటా ఇండియా స్ట్రాటజీ ప్రోగ్రామ్స్ దివ్య కెమనీ వధేరా, ఆర్‌టీజీఎస్, ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌లకు సూచించారు. రాష్ట్రంలో మన మిత్రను ప్రారంభించాక మెటా బృందంతో కలసి నారా లోకేశ్ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వాట్సాప్ సేవలు చాలా పగడ్బందీగా అందిస్తున్నామని మంత్రి లోకేశ్, మెటా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది. పౌరుల డేటా బయటకు వెళ్లకుండా సాంకేతికపరంగా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధ్రువీకరణ పత్రాల విషయంలోనూ సాంకేతికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కులధ్రువీకరణ పత్రాల జారీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలన్నింటి సేవలను పౌరులకు ఒకే వేదికద్వారా అందేలా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఈ బృందంతో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కార్యదర్శులు రాజమౌళి, ప్రద్యుమ్న కూడా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 31 , 2025 | 03:22 AM