AP CM Industrial Policy: రాష్ట్రంలో పరిశ్రమల జోరు
ABN, Publish Date - May 16 , 2025 | 02:39 AM
ఆంధ్రప్రదేశ్‌లో 32,271 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో 35,371 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
32,271 కోట్ల పెట్టుబడులు 35,371 ఉద్యోగాలు
తయారీ, పర్యాటకం, ఇంధన రంగాల్లో 19 ప్రతిపాదనలకు ఆమోదం
చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ భేటీ
డ్యాష్‌బోర్డు ద్వారా పురోగతిపై పర్యవేక్షణ
శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం దాకా నిరంతర పరిశీలన బాధ్యత అధికారులదే
పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి
6 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 76 ప్రాజెక్టులు
మొత్తం 4,95,796 కోట్ల పెట్టుబడులు, 4.5 లక్షల ఉద్యోగాలు
పర్యాటక అభివృద్ధికి 50 వేల హోటల్ రూమ్‌లు అందుబాటులోకి తేవాలి: సీఎం
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు ఆకర్షితులవుతున్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆరో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో మొత్తం రూ.32,271 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ పెట్టుబడులు వాస్తవ రూ పం దాలిస్తే 35,371 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తయారీ, పర్యాటకం, ఇంధనం రంగాల్లో 19 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. గడచిన ఐదేళ్లూ జగన్ ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు వెనకడుగు వేసిన పారిశ్రామికవేత్తలు.. కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెడతామంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు. తాజా ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల ప్రతిపాదనల వివరాలు...
భారీ పరిశ్రమలు
అగ్రి కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ పరిశ్రమకు గ్రీన్‌ఫీల్డ్ సదుపాయం కల్పించడం కోసం డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 7,608 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం డెక్కన్ ఫైన్ కెమికల్స్ రూ.2,560 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 1800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను స్థాపించేందుకు ఆమో దం తెలిపారు. బీఈఎల్ రూ.1400 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 800 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
ఓర్వకల్లులో పీయూఆర్ ఎనర్జీ రూ.1200 కోట్ల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి కల్పించేలా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ ప్లాంటు కోసం ఓర్వకల్లులో టైలర్‌మేడ్ ఇన్సెంటివ్ విధా నం అమలుచేస్తూ 115 ఎకరాలుకేటాయించారు.
బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇంటర్మీడియట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను స్థాపించేందుకు ప్రతిపాదించింది. ఇందుకోసం రాయితీతో 125.12 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో రూ.1,750 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 1750 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకొచ్చింది.
జూపిటర్ రెన్యువబల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధిని కల్పించేలా 4.8 మెగావాట్ల సోలార్ సెల్, 1.5 మెగావాట్ల మాడ్యూల్స్ తయారీ చేస్తామని ప్రతిపాదించింది. ఏపీఐడీపీ విధానం మేరకు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ఆమోదించారు.
వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,061 కోట్లతో 10,098 మందికి ఉద్యోగాల కల్పనకు ప్రతిపాదనలు పంపింది. ఈ సంస్థకు తిరుపతిలోని ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2లో కేటాయించిన 75 ఎకరాలకు సేల్ డీడ్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
మెస్సర్స్ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 3,900 మందికి ఉద్యోగాలు కల్పించే 2000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా లిమిటెడ్ తిరుపతి శ్రీసిటీలో రూ.2,475 కోట్ల పెట్టుబడితో 5,150 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎయిర్ కండీషనర్స్, కాంపౌనెంట్‌లు తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ఆమోదం తెలిపారు.
ఇతర పరిశ్రమలు
నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏలూరు) రూ.150 కోట్లతో 500 మందికి ఉపాధి కల్పిస్తూ రోజుకు ఇరవై టన్నుల ఉత్పత్తితో కంప్రెష్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు.
తిరుపతిలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్‌ఎల్‌పీ రూ.150 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు పంపింది. ఈ సంస్థకు తిరుపతి ఎస్వీపురంలో 5-స్టార్ రిసార్ట్స్ నిర్మించేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
తిరుపతిలోని సరస్వతి హోటల్స్ అండ్ రీసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.327 కోట్ల పెట్టుబడితో 570 మందికి ఉద్యోగాలు కల్పించేలా 3 స్టార్, 5 స్టార్ హోటల్ క్లస్టర్‌కు అంగీకారం తెలిపారు.
కీలక ప్రతిపాదనలకు ఆమోదం
సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.2,920 కోట్లతో 230 మందికి ఉపాధి కల్పించేలా 300 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ను ఎకోరన్‌కు బదలాయించేందుకు ఆమోదం తెలిపారు.
కడపలో అంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,941 కోట్ల పెట్టుబడితో 260 మందికి ఉద్యోగాలు కల్పించేలా స్థాపించిన 260 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు బదలాయింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
మెస్సర్స్ సెన్సోరెమ్ ఫొటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్రియేటివ్ సెన్సార్స్) రూ.1,057 కోట్లతో 622 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రతిపాదించిన ప్రాజెక్టుకు 2024-29 పాలసీ ప్రకారం టైలర్‌మేడ్ ఇన్సెంటివ్‌లను ఇస్తామంటూ ప్రభుత్వం మంజూరు లేఖ ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ అంగీకరించింది.
ప్రోత్సాహకాల పొడిగింపు
మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్ రూ.482 కోట్ల పెట్టుబడితో 3,575 మందికి ఉద్యోగాలను కల్పించింది. ఈ సంస్థకు ప్రోత్సాహకాలను మరో మూడేళ్లు పొడిగిస్తూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,779 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగాలను కల్పించింది. ఈ సంస్థకు ప్రోత్సాహకాల గడువును పెంచేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదించింది.
పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ
2014-19 తరహాలో నోడల్ అధికారులు
ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసేలా, ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షణ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ జరిగిన ఆరు ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులు, 4,50,934 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. పారిశ్రామిక సంస్థల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి చేపట్టే దాకా నిరంతరం పరిశీలన చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం 2014-19 తరహాలో నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సంస్థ ఎంత పెట్టుబడులు పెడుతుంది.. ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది.. వంటి విషయాలను ఒక పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రపంచ శ్రేణి దిగ్గజ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై రాజకీయంగా చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని అన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచివేయకపోతే పారిశ్రామికవేత్తలు మనోనిబ్బరం కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న పరిశ్రమలు ఖాయిలా పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్ పరిశ్రమను ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎస్‌ఐపీబీ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ హాజరయ్యారు.
టూరిజం ప్రాజెక్టులపై సమీక్ష
టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపైనా సీఎం సమీక్షించారు. టూరిజం సెక్టారులో హోటళ్లు, గదుల కొరత చాలా ఉందని అన్నారు. 50,000 హోటల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పర్యాటక శాఖను సీఎం ఆదేశించారు. హోటళ్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా ప్రత్యేకంగా తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక శోభ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
Updated Date - May 16 , 2025 | 05:51 AM