Thefts : దొంగల్లారా.. దొరికిపోండి..!
ABN, Publish Date - Mar 20 , 2025 | 12:02 AM
దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలు చేస్తున్నారు. దొరికినంతా డబ్బు, నగలు అపహరించుకెళ్తున్నారు. ఆరునెలల వ్యవధిలోనే పదికిపైగా చోరీలకు పాల్పడ్డారు. పోలీసుల దృష్టికి రానివి మరో పదికిపైగా ఉంటాయని సమాచారం. పోలీసులకు బాధితులు ఫిర్యాదలు చేస్తున్నారు. పట్టించుకోకపోవడంతో ...
నార్పలలో వరుస చోరీలు
పోలీసులకు బాధితుల ఫిర్యాదులు
ఉన్నతాధికారులకు అర్జీలు
ఒక్క కేసూ ఛేదించని దుస్థితి
డబ్బు, నగలపై ఆశలు
వదులుకుంటున్న బాధితులు
నార్పల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలు చేస్తున్నారు. దొరికినంతా డబ్బు, నగలు అపహరించుకెళ్తున్నారు. ఆరునెలల వ్యవధిలోనే పదికిపైగా చోరీలకు పాల్పడ్డారు. పోలీసుల దృష్టికి రానివి మరో పదికిపైగా ఉంటాయని సమాచారం. పోలీసులకు బాధితులు ఫిర్యాదలు చేస్తున్నారు. పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు అర్జీలు సైతం ఇస్తున్నారు. ఏమాత్రం ప్రయోజనం లేదని బాధితులు వాపోతున్నారు. ఒక్కటంటే ఒక్క చోరీ కేసు కూడా ఛేదించలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో చోరీ అయిన తమ డబ్బు, నగలపై బాధితులు ఆశలు వదులుకుంటున్నారు.
జనం బెంబేలు..
నార్పలలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారాలతో నార్పలలో ఆర్థికంగా బాగా ఉన్నారు. దీంతో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ జరిగిన వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలిస్తున్నారు. కేసులో మాత్రం ఎలాంటి పురోగతి సాధించకపోవడం గమనార్హం. దొంగలను పట్టుకుని తమ డబ్బు, నగలు ఇప్పించాలని పోలీసు స్టేషన చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా
పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపి, దొంగలను పట్టుకుని తమ డబ్బు, నగలు రికవరీ చేయాలనీ, మండలంలో చోరీలు జరగకుండా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వరుస చోరీలు..
- నార్పలలోని ఉద్దిబావి చేను కాలనీలో నివాసముంటున్న పులసలనూతల సునీత ఇంట్లో ఆరు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
- దూల్పేట్ కాలనీకి చెందిన చాకలి నాగేశ్వరి ఇంట్లో రూ.లక్ష, ఒకటిన్నర తులం బంగారు నగలు
- దిగుమర్రి రోడ్డుకు చెందిన ఫాదర్ డేవిడ్ ఇంట్లో 9 తులాల బంగారు నగలు
లక్ష్మీనగర్‌కు చెందిన వెంకటశేషప్ప ఇంట్లో 5 కేజీల వెండి, మూడు తులాల బంగారు నగలు
- నార్పల క్రాసింగ్‌లో ఉన్న హోటల్ రాజు ఇంట్లో తులం బంగారం, రూ.30వేలు నగదు
- వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు ఇంట్లో రూ.3లక్షలు
- పోలీసుల దృష్టికి రానివి చాలానే ఉన్నాయని తెలుస్తోంది. నార్పల క్రాసింగ్‌లో ఇటీవల వేణు అనే వ్యక్తి సిమెంటు దుకాణం తలుపులు బద్దలుకొట్టి, రూ.లక్ష విలువ చేసే 300 ప్యాకెట్లు అపహరించారు. దీనిపై కేసు నమోదు కాలేదు. ఇలా చెప్పుకుంటూపోతే కేసు నమోదు కానివి పదుల సంఖ్యలో ఉన్నాయని తెలుస్తోంది.
డబ్బు, నగలపై ఆశలు వదులుకున్నా
నా భర్త చనిపోయిన రెండు రోజుల తరువాత గుడి వద్దకు నిద్ర చేయడానికి పిల్లలతో సహా గూగూడు వెళ్లా. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రూ.లక్ష, ఒకటిన్నర తులం బంగారు నగలు చోరీ చేశారు. దొంగలు పడి నాలుగు నెలలవుతోంది. పోలీసులు నేటికీ పట్టించుకోలేదు. నా డబ్బు, నగలపై ఆశ వదులుకున్నా.
- చాకలి నాగేశ్వరి, నార్పల
నాలుగు సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేశా
కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లినపుడు చోరీ చేశారు. ఏడు నెలలవుతోంది. అనుమానితుల పేర్లు కూడా చెప్పా. కనీసం వారిని పిలిపించి, విచారించలేదు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డబ్బు, నగదు రికవరీ చేయించాలని ఎస్పీకి నాలుగు సార్లు ఫిర్యాదు చేశా.
- పులుసులనూతల సునీత, నార్పల
త్వరలోనే దొంగలను పట్టుకుంటాం
చోరీలపై విచారణ చేస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే కొందరు అనుమానితులను గుర్తించాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. చోరీల నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం.
- సాగర్, ఎస్‌ఐ, నార్పల
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Mar 20 , 2025 | 12:03 AM