Amit Shah: బాబు సుదీర్ఘ అనుభవంతో.. అభివృద్ధి బాటలో ఆంధ్ర
ABN, Publish Date - Jun 19 , 2025 | 06:25 AM
ముఖ్యమంత్రిగా చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్థి బాటలో నడిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్రం సహకారం.. లోకేశ్‌కు అమిత్‌షా హామీ
కేంద్ర హోం మంత్రితో భేటీలో రాష్ట్ర పరిణామాలపై యువనేత చర్చ
మద్యం స్కాం, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలూ ప్రస్తావన
యువగళం పుస్తకం అందజేత.. ముగ్గురు కేంద్ర మంత్రులతోనూ భేటీ
న్యూఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్థి బాటలో నడిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ బుధవారం ఢిల్లీలో అమిత్‌షాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్థి పనుల ప్రగతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉభయులూ చర్చించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వంటివి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. 226 రోజులు 3,132 కిమీల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేశ్‌ను షా ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం కోరడానికి చేపట్టిన ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేశ్ బుధవారం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాసవాన్‌తో కూడా వరుసగా సమావేశమయ్యారు. యువగళం పుస్తకాన్ని అందజేశారు.
కాంక్లేవ్ చాన్సు ఏపీకి ఇవ్వండి..
విద్యాభివృద్థిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేయడంలో భాగంగా వచ్చే నెల 5న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు రావాలని ప్రధాన్‌కు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరగా ఆయన అంగీకరించారు. ‘రాష్ట్రంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్థి చేస్తున్నాం. 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో వన్ క్లాస్-వన్ టీచర్ విధానం ప్రవేశపెట్టాం. మూడేళ్లలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ‘ప్రాజెక్టు అ, ఆ(అక్షర ఆంధ్ర)’ను చేపట్టాం. రాజకీయం జోక్యం లేకుండా టీచర్ల బదిలీల చట్టం తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను బదిలీలు, పదోన్నతులు విజయవంతంగా పూర్తిచేశాం’ అని వివరించారు.
హైకోర్టు బెంచ్ సీమ ప్రజల చిరకాల కోరిక..
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని మేఘ్వాల్‌ను లోకేశ్ అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు రాయలసీమ ప్రజల చిరకాల కోరికగా పేర్కొన్నారు. వారు హైకోర్టులో కేసుల కోసం అమరావతికి రావడానికి 500 కిమీకు పైగా ప్రయాణించాల్సి వస్తోందన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కోసం తనకు విజ్ఞప్తి చేశారని తెలిపారు.
సీమను హార్టికల్చర్ హబ్‌గా..
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పాసవాన్‌కు లోకేశ్ విజ్ఞప్తిచేశారు. సీమ రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారని ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు చేస్తే వారికి మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. పాసవాన్ సానుకూలంగా స్పందించారు. తిరుపతి ట్రిపుల్ ఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను జూలై 11, 12 తేదీల్లో వస్తున్నానని, మీరు కూడా వస్తే క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామని లోకేశ్‌కు సూచించారు. పర్యటనలో ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నాగరాజు, కృష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, కేశినేని చిన్ని, మాగుంట, సానా సతీశ్ ఉన్నారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బాబు ముందుంటారు: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ఎల్లప్పుడూ ముందుంటారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన్ను లోకేశ్ కలిశారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని లోకేశ్ చెప్పగా.. ఉపరాష్ట్రపతి పై వ్యాఖ్యలు చేశారు. రాజధాని పనుల పురోగతిపై ఆరా తీశారు. రూ.64 వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, వేగంగా పూర్తిచేస్తామని లోకేశ్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిని ఎంచుకున్నానని లోకేశ్ చెప్పగా.. తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకుని పోరాడానని ధన్‌ఖడ్ అన్నారు. యువగళం పుస్తకాన్ని లోకేశ్ అందజేయగా.. ఆయన అభినందించారు.
Updated Date - Jun 19 , 2025 | 06:25 AM