Mission Bhagiratha: బడిలో బోరు నీరే దిక్కు!
ABN, Publish Date - Dec 31 , 2024 | 04:01 AM
రాష్ట్రంలోని ప్రజలందరికీ పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన పథకం.. మిషన్ భగీరథ. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
వేలాది స్కూళ్లలో భగీరథ నల్లాలు నిరుపయోగం
కొన్ని విద్యా సంస్థలకు మాత్రమే స్వచ్ఛమైన నీరు
చాలా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లతోనే వెళ్లదీత
గురుకులాలు, హాస్టళ్లకు తప్పని ఇబ్బందులు
నిర్వహణ లోపమే.. శాపంగా మారిన పరిస్థితి
చాలా చోట్ల అపరిశుభ్రంగా వాటర్ ట్యాంకులు
బ్లీచింగ్ లేకపోవడంతో నాచు పెరిగి అధ్వానం
ప్రైవేట్ భవనాల్లోని గురుకులాలకు కనెక్షన్లే లేవు
కలుషిత నీటితో అనారోగ్యం బారిన విద్యార్థులు
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో సమస్యల గుర్తింపు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలోని ప్రజలందరికీ పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన పథకం.. మిషన్ భగీరథ. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వేలాది గ్రామాల్లో పైపులైన్లు, వాటర్ ట్యాంకులను నిర్మించింది. కానీ, చాలా చోట్ల పనులు పూర్తి కాకపోవడం, నిర్వహణ లోపాలు ఈ పథకానికి శాపంగా మారాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలకు మిషన్ భగీరథ కింద పైపులైన్ కనెక్షన్లు ఇచ్చినా.. ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థులు బోరు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల గురుకులాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సైతం నీటి స్వచ్ఛతపై అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా గురుకులాలకు మిషన్ భగీరథ కనెక్షన్లు లేవని ఓ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల ఇచ్చారా? వాటి ద్వారా నీరు అందుంతుందా? లేదా? వంటి అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. చాలా పాఠశాలలకు నల్లా కనెక్షన్లు లేకపోవడం, ఉన్న వాటి ద్వారా నీళ్లు రాకపోవడం, అపరిశుభ్ర ట్యాంకులు, బోరు నీటినే వినియోగించడం..ఇలా అనేక సమస్యలను గుర్తించింది.
జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో 2237 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 1307 పాఠశాలలకు మిషన్ భగీరథ పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిగతా 930 పాఠశాలల్లో మాత్రం స్థానిక నల్లా కనెక్షన్లు, బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలో 728 పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్లు లేవు. ఇక, ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు కలిపి 77వరకు ఉన్నాయి. వీటిలో 42 గురుకులాలకు ప్రభు త్వ భవనాలు ఉండగా.. మిషన్ భగీరథ కనెక్షన్లతోపాటు ఆర్వో ప్లాంట్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు మాత్రం స్థానిక నల్లాల ద్వారా లేదా బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి కోసం ఎక్కువగా మినరల్ వాటర్‌ను వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 105 వసతి గృహాలు ఉండగా.. 50 చోట్ల తాగునీటి సమస్య లేదు. మిషన్ భగీరథ, మున్సిపాలిటీల పరిధిలోని నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మిగతా వసతి గృహాల్లో బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరుచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇందుకు ఆహారంతో పాటు తాగు నీరూ కారణమేనన్న వాదన వినిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 271 ఉన్నత పాఠశాలలు, 50 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 14కస్తూర్బా గాంధీ గురుకులాలు, 7 మోడల్ స్కూళ్లు, 2తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలు, 12 ఎస్సీ గురుకులాలు, 23 ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు 2 ఉన్నాయి. అయితే, చాలా పాఠశాలల్లో ప్రహరీ వరకే మిషన్ భగీరథ పైపులైన్లు వేసి.. చేతులు దులుపుకొన్నారు. మన ఊరు - మన బడి పథకం కింద పాఠశాలల్లో సంపులను నిర్మించినా.. నల్లా కనెక్షన్ ఇవ్వక పోవడంతో నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కనెక్షన్లు ఇచ్చినా.. సక్రమంగా బ్లీచింగ్ చేయకపోవడంతో నాచు పెరిగిపోయి అధ్వానంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 15 ఆశ్రమ పాఠశాలలు, 15 కేజీబీవీ పాఠశాలలు, 3 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, 2 ట్రైబర్ వెల్ఫేర్ గురుకులాలు, 35 పాఠశాలలకు మాత్రమే భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 73 గురుకులాలు, 44గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలు, 29 సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. గురుకులాల్లో ఎక్కడా మిషన్ భగీరథ పైప్‌లైన్ కనెక్షన్లు లేవని విద్యార్థులు చెబుతున్నారు. చాలా చోట్ల బోర్ నీటినే విద్యార్థులు తాగుతుండగా.. కొన్ని చోట్ల వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నారు.
అపరిశుభ్రంగా వాటర్ ట్యాంకులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మోడల్ స్కూళ్లు, కేజీబీవీ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్, గురుకులాలు, పీఎస్, యూపీఎస్, జడ్పీహెచ్‌ఎ్‌సలు కలిపి మొత్తం 3,092 ఉన్నాయి. వీటిలో 95 శాతం విద్యా సంస్థలకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. వికారాబాద్ పరిధిలోని జెడ్పీ బాలుర ఉన్న పాఠశాల, బూర్గులపల్లి పాత కలెక్టరేట్‌లో కొనసాగుతున్న ఎస్సీ బాలికల గురుకులం, అనంతగిరిపల్లిలోని ఎస్సీ బాలుర గురుకులం, అనంతగిరిపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స, డైట్ సమీపంలోని ఎస్సీ-1 , బీసీ వసతి గృహాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని పాఠశాలలకు భగీరథనీరు సరఫరా అవుతున్నప్పటికీ.. ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 1,216 పాఠశాలలు ఉండగా.. 100కుపైగా పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని చోట్ల బోరు వాటర్‌నే విద్యార్థులు తాగుతున్నారు. గురుకులాల్లో ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీరు తెప్పిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో 1,067 పాఠశాలలు ఉండగా 60 పాఠశాలల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు లేవు. దీంతో బోరు నీటినే వినియోగిస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగంలో 53 గురుకుల పాఠశాలలు, రెండు కాలేజీలున్నాయి. వీటిలో పక్కా భవనాలు ఉన్న వాటికి మాత్రమే మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో బోరు నీటిని వినియోగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,309 ప్రభుత్వ పాఠశాలలు, 282 వివిధ సంక్షేమ, గురుకుల హాస్టళ్లు, 67 కేజీబీవీలు, 35 మోడల్ స్కూళ్లు ఉండగా.. అన్నింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2617 పాఠశాలలు, 56 కేజీబీవీలు, 97 గురుకుల పాఠశాలలు, 184 వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వంటలు చేసేందుకు ఆ నీటినే వినియోగిస్తున్నారు.
నిర్వహణ లోపాల వల్లే ఇబ్బందులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,204 ప్రభుత్వ పాఠశాలలు, 288 సంక్షేమ హాస్టళ్లు, 196 గురుకులాల ఉండగా.. అన్నింటికీ మిషన్‌భగీరథ నీటి కనెక్షన్లు అధికారికంగా ఇచ్చారు. కానీ నిర్వహణ లోపాలతో చాలా చోట్ల భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ప్రధానంగా హాస్టళ్లలో ఈ సమస్య ఉంది. ఉమ్మడి జిల్లాలోని సగానికిపైగా హాస్టళ్లకు భగీరథ నీరు అందడం లేదు. పాఠశాలల్లోనూ భగీరథ నీటి సరఫరాలో లోపాలున్నాయి. అయితే స్కూళ్లలో దాతలు, స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ఉండడంతో తాగునీటి సమస్య తలెత్తడం లేదు. గురుకులాల్లో బోరు బావుల నీటిని ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి వినియోగిస్తున్నారు. నల్లగొండ జిల్లా ఉరుమడ్ల బీసీ హాస్టల్‌కు మిషన్‌భగీరథ కనెక్షన్ లేదు. స్థానికంగా ఉన్న బోరుబావి నీటిని వాడుతున్నారు. దేవరకొండ, చందంపేట మండలాల్లోని హాస్టళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వపోవడంతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని బోరు నీటిని శుద్ధి చేస్తున్నారు. శాలిగౌరారం జడ్పీహైస్కూల్, మాదారం ఎస్సీకాలనీ, అడ్డూరు, జంగాలవారిగూడెం ప్రైమరీ స్కూళ్లకు మిషన్‌భగీరథ కనెక్షన్లు లేవు. భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఏడు పాఠశాలలకు నల్లా కనెక్షన్లు లేవు.
అస్తవ్యస్తంగా పైపులైన్ల నిర్మాణం
మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 897, వసతి గృహాలు 54, గురుకులాలు 23, కేజీబీవీ 19, మోడల్ స్కూల్స్ 7 ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పాఠశాలలకు కాంట్రాక్టర్లు అస్తవ్యస్తంగా పైపులైన్లు ఏర్పాటు చేయడం, నల్లా కనెక్షన్లు ఇచ్చినా లీకేజీల కారణంగా నీరు సరఫరా కావడం లేదు. చేతి పంపులు, బోర్లు, ఇతర చోట్ల నుంచి నీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నల్లా నీళ్లు ఉదయమే వస్తుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చేలోగానే సరఫరా నిలిచిపోతోంది. దాంతో చాలా పాఠశాలల్లో భగీరథ నీటిని వాడడం లేదు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలన్నింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 3225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 444 పాఠశాలల్లో నల్లా కనెక్షన్లు లేవు. భగీరథ నీరు కూడా రంగుమారి వస్తుండడంతో విద్యార్థులు తాగేందుకు ఇష్టపడడం లేదు.
Updated Date - Dec 31 , 2024 | 04:01 AM