Hyderabad: భూ బకాసురులపై చర్యలేవీ?
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:48 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరించిన భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చి దాదాపు ఏడు నెలలైనా.. ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలుగా సర్కారు స్థలాల క్రమబద్ధీకరణ
నాటి ప్రభుత్వంతో సన్నిహిత
సంబంధాలున్న వారి అక్రమాలు
రిజిస్ట్రేషన్ ధరలకే రూ.కోట్ల స్థలాల స్వాహా
7 నెలల కిందటే వెలుగులోకి..
క్రమబద్ధీకరణలను పునఃసమీక్షించాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు
అయినా అడుగు ముందుకు పడని వైనం
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరించిన భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చి దాదాపు ఏడు నెలలైనా.. ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమంగా క్రమబద్ధీకరించుకున్న కన్వేయన్స్ డీడ్‌లను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరు క్రమబద్ధీకరించుకున్నారు, వెనక ఉండి నడిపింది ఎవరు వంటి వివరాలతో సమగ్ర సమాచారాన్ని విజిలెన్స్ అధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అయినా ప్రభుత్వం కబ్జాదారులకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. అడ్డదారిలో క్రమబద్ధీకరించుకున్న కన్వేయన్స్ డీడ్‌ను రద్దు చేయాలంటే ముందు నోటీసులు ఇవ్వాలి. సంజాయిషీ ఇచ్చేందుకు విధించిన గడువు పూర్తయ్యాకే రద్దు చేయటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియకు అడుగులేమీ పడలేదు.
ఇదీ నేపథ్యం..
రాష్ట్రవ్యాప్తంగా జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణకు 2022, 2023లలో 1.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32 వేల దరఖాస్తులకు సంబంధించిన స్థలాలను క్రమబద్ధీకరించారు. క్రమబద్ధ్దీకరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలంలో 2020 జూన్ 2 నాటికి ఇల్లు నిర్మించుకొని, అందులో నివాసం ఉండి, ఆ అడ్ర్‌సపైనే ఆధార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటు, వాటర్ బిల్లు మొదలైనవి ఉన్నవారికి మాత్రమే ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. జీవో 59లో పేర్కొన్న ఈ నిబంధనలను తుంగలో తొక్కి పలువురు భారీ ఆక్రమణలకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఖాజాగూడ, గండిపేట, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, అబ్దుల్లాపూర్‌మెట్, కీసర, పటాన్‌చెరు, బాచుపల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే స్థలాలను కేవలం రిజిస్ట్రేషన్ విలువలకే అడ్డదారిలో క్రమబద్ధీకరించుకున్నారు.
ఈ తతంగం అంతా 2023లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు నుంచి, ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు వరకు జరిగింది. రాష్ట్రంలో అనేక ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఈ జీవోను అడ్డం పెట్టుకొని కొందరు భారీ అక్రమాలకు పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు తమ ఇంట్లో పనిచేసేవారు, డ్రైవర్లు, కార్యకర్తలు, వారి వారి కుటుంబసభ్యుల పేర్ల మీద క్రమబద్ధీకరణ చేయించారు. కొందరు ఇల్లు లేకపోయినా ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. గతంలో కూల్చిన ఇళ్ల మొండిగోడలకు ఇంటి నెంబర్లు, కరెంట్ బిల్లులు తెచ్చుకొన్నారు. మరికొందరు ఒకే ఇంటి నెంబరుతో అనేక దరఖాస్తులు చేసి క్రమబద్ధీకరించుకున్నారు. ఒకే కరెంట్ బిల్లుతో పదుల సంఖ్యలో దరఖాస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరించిన స్థలాలను కొందరు మరుసటి రోజే విక్రయించారు. మరికొందరు అదేరోజు అమ్మేశారు.
మంత్రి ప్రకటనతో మళ్లీ తెరపైకి
తాజాగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. అక్రమంగా క్రమబద్ధీకరించిన స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పటంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కబ్జాదారులు ప్రభుత్వానికి చెల్లించిన (కన్వేయన్సీ డీడ్ అమౌంట్) దాదాపు రూ.32 కోట్లు తిరిగి వారికే చెల్లించి, భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇకనైనా ముందడుగు పడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ భూ కుంభకోణంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వీటికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జీవో 59 కింద అప్పటికే క్రమబద్ధీకరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో క్రమబద్ధీకరణ పూర్తయిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీలను ప్రభుత్వం ఆదేశించింది. రంగారెడ్డి జిల్లాలో క్రమబద్ధీకరించిన స్థలాలకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లకు అనుమతివ్వరాదని జిల్లా కలెక్టర్ శశాంక్.. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌కు జనవరి 29న ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Jul 15 , 2024 | 04:48 AM