AP News: వివాదంలో IPS సునీల్.. ఎందుకంటే..?
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:16 PM
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Sunil Kumar) వివాదంలో చిక్కుకున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయమై ట్విట్టర్ (X) వేదికగా సునీల్ స్పందించారు.
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Sunil Kumar) వివాదంలో చిక్కుకున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయమై ట్విట్టర్ (X) వేదికగా సునీల్ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రఘురామ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సోషల్ మీడియాలో సునీల్ ఈ పోస్ట్ పెట్టడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ఈ రకమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. సునీల్ ఇలా చేయడాన్ని ధిక్కరించడమేనని అన్నారు. ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్‌లోని రూల్ నంబరు 7ను ఉల్లంఘించడమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. సునీల్ పోస్ట్ పై ప్రభుత్వానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సునీల్ పోస్టింగును పరిగణనలోకి తీసుకుని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
కాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు సీనియర్ పోలీసు అధికారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. గతంలో సీఐడీ డీజీగా పని చేసిన సునీల్ కుమార్ పైన రఘురామ రాజు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో సీఐడీ కేసు నమోదైంది. ఆ సమయంలో సీఐడీ అధికారులు తనను కొట్టటంతో పాటుగా హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు చేశారు. ఇదంతా నాటి సీఎంగా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో తెలిపారు.
Updated Date - Jul 12 , 2024 | 04:29 PM