CM Chandrababu : జలంతో జయం
ABN, Publish Date - Dec 31 , 2024 | 02:55 AM
గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
గోదావరి-బనకచర్ల అనుసంధానంతో తెలుగుతల్లికి జలహారతి
3 ఏళ్లు.. 80,112 కోట్ల వ్యయం
తొలి దశలో రూ.13,511 కోట్లతో పోలవరం - ప్రకాశం బ్యారేజీకి జలాలు
అక్కడి నుంచి బొల్లాపల్లి వరకు
రెండో దశలో 150 టీఎంసీల ఎత్తిపోత
దీని అంచనా వ్యయం 28,560 కోట్లు
మూడో దశలో బనకచర్లకు తరలింపు
38,014 కోట్లతో రోజుకు 2 టీఎంసీలు
మొత్తంగా 368 కి.మీ. ప్రయాణం
పది లిఫ్టులతో నీరు ఎత్తిపోత
కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ పద్ధతిలో అమలు: ముఖ్యమంత్రి
రాయలసీమకు ఇది గేట్‌వే
పూర్తయితే రాష్ట్రానికే గేమ్‌చేంజర్
కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించా
3 నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు
ఆమోదం లభిస్తే ఆ తర్వాత 2-3 నెలల్లో టెండర్లు
కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయి. గోదావరిలో 4,114 టీఎంసీల వరద సముద్రంపాలవుతోంది. నదుల అనుసంధానంతో ఇందులో కనీసం కృష్ణాకు 200 టీఎంసీలను తరలించినా కరువు, వరదలను ఎదుర్కోవచ్చు.బనకచర్లకు గోదావరి నీటిని తీసుకువెళ్లగలిగితే.. రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం పూర్తయినట్లే. తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లే!
- ముఖ్యమంత్రి చంద్రబాబు
కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయి. గోదావరిలో 4,114 టీఎంసీల వరద సముద్రంపాలవుతోంది. నదుల అనుసంధానంతో ఇందులో కనీసం కృష్ణాకు 200 టీఎంసీలను తరలించినా కరువు, వరదలను ఎదుర్కోవచ్చు. బనకచర్లకు గోదావరి నీటిని తీసుకువెళ్లగలిగితే.. రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం పూర్తయినట్లే. తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లే!
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో రూ.80,112 కోట్లతో గోదావరి-బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ అనుసంధానం పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ‘తెలుగు తల్లికి జలహారతి’ పేరిట చేపట్టనున్న ఈ ప్రాజెక్టు గురించి సోమవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో మీడియాకు ఆయన వివరించారు. బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ రాయలసీమకు గేట్‌వేగా మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికే గేమ్ చేంజర్ అవుతుందని చెప్పారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ పథకం గురించి వివరించానన్నారు. దీనికి ఇప్పటి ధరల ప్రకారం రూ.80,112 కోట్లవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిపాదనల ఆధారంగా.. ప్రాజెక్టుకు నిధులు ఎలా విడుదల చేయాలో ఆలోచిస్తామని ఆమె చెప్పారన్నారు. ఈ పథకాన్ని మరో పదేళ్లు ఆలస్యం చేస్తే .. ఖర్చు మూడింతలు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు కలసి హైబ్రిడ్ విధానంలో అమలు చేయాలన్న యోచనలో ఉన్నామని ఆమెకు చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..
నిర్మాణం ఇలా..
తెలుగుతల్లికి జలహారతి ప్రాజెక్టును మూడు దశల్లో చేపడతాం. గోదావరి జలాలను తొలి దశలో రూ.13,511 కోట్లతో 187 కిలోమీటర్ల మేర పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తాం. ఇందుకోసం కుడికాలువను 38,000 క్యూసెక్కుల స్థాయికి విస్తరిస్తాం. మార్గమధ్యంలో ఒక లిఫ్ట్‌ను నిర్మిస్తాం. పది సొరంగాలను నిర్మిస్తాం. అక్కడి నుంచి రెండో దశలో రూ.28,560 కోట్ల అంచనా వ్యయంతో బొల్లాపల్లి రిజర్వాయరులోకి 150 టీఎంసీలు ఎత్తిపోస్తారు. ఇందుకోసం కాలువను 24 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరిస్తాం. ఆరు లిఫ్టులు పెట్టి 84 కిలోమీటర్ల మేర జలాలు తరలిస్తాం. మూడో దశలో రూ.38,014 కోట్లతో బొల్లాపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 300 టీఎంసీలు ఎత్తిపోస్తాం. మూడు లిఫ్టులతో 108.4 కిలోమీటర్లు తీసుకెళ్తాం.
మొత్తంగా పది లిఫ్టులతో 368 కిలోమీటర్ల వరకు గోదావరి జలాలను తరలిస్తాం. 48,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును కేంద్రమే పూర్తిగా భరించేలా లేదు. అందువల్ల కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ విధానంలో నిర్మిస్తాం. మూడు నెలల్లో ఈ పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)తో కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక ఇంకో 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తాం. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఎనర్జీ అమలు దిశగా పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ పథకాలను అమలు చేస్తాం. బొల్లాపల్లి నుంచి వెలిగొండకు కూడా తరలిస్తాం.
గోదావరి-కావేరితో లాభం లేదు
కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కావేరి అనుసంధాన పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. మన రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే ఆంధ్రను సస్యశ్యామలం చేయవచ్చు. రాష్ట్రంలో రిజర్వాయర్ల సామర్థ్యం 983 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం వాటిలో 729 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. జనవరి ఒకటో తేదీకి రిజర్వాయర్లలో 74 శాతం నీళ్లు ఉండడం రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి.
ఎల్లుండి డయాఫ్రం వాల్ పనులు
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు జనవరి రెండో తేదీన ప్రారంభమవుతాయి. ప్రాజెక్టు క్షేత్రంలో చేపట్టే ఈ కార్యక్రమంలో నేనూ పాల్గొంటా.
గేరు మార్చబోతున్నాం!
పాలనలో వేగానికి తగ్గట్లే అధికారులు పనిచేయాలి: సీఎం
కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ వేగానికి తగట్లుగా అధికారులంతా పని చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి, వారు తమ పనితీరు మెరుగు పరచుకోవాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీఎ్‌స)పై ఆయన సమీక్ష జరిపారు. ‘రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ పాలన కొనసాగాలి. అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలి. అప్పుడే జనరంజక పాలన సాకారమవుతుంది. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లు, దేవాలయాలు, ఆస్పత్రుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుతున్న సేవలపై అభిప్రాయాలు సేకరించాలి. పింఛన్ల పంపిణీని జీపీఎస్ ద్వారా తెలుసుకోవాలి. మద్యం బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకపై ప్రతి సోమవారం రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష ఉంటుంది. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌ల్లో సీసీ కెమేరాలు, వాహనాలకు జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలి. ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌లో ఒక్క ఆరోగ్య రంగానికే రూ.18 వేల కోట్లు కేటాయించాం. ఆ స్థాయిలోనే ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలి. రాష్ట్రంలో రూ.860 కోట్లతో జరుగుతున్న రోడ్ల మరమ్మతులపైనా అభిప్రాయాలు సేకరించాలి. రాష్ట్రంలో డ్రోన్ల సేవలు ఎవరెవరికి అవసరమో వివరాలు సేకరించాలి. డ్రోన్లు వినియోగం అందుబాటులోకి తెస్తే.. సమయంతో పాటు అదనపు ఖర్చు తగ్గుతుంది. ఇక నుంచి టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో పాటు ఆడిట్ కూడా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
Updated Date - Dec 31 , 2024 | 02:57 AM