Article 370: ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దాని చుట్టూ ఉన్న వివాదాలు, రద్దుకు గల కారణాలివే!
ABN, First Publish Date - 2023-12-11T13:19:06+05:30
ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దాని చుట్టూ ఉన్న వివాదాలు ఏమిటి? ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. జమ్ము కశ్మీర్ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని, దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయకూడదని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్ కూడా అన్ని రాష్ట్రాల లాంటిదేనని చెప్పిన ఆయన, ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అంతర్గత సార్వభౌమాధికారం లేదని చెప్పారు. ఈ మేరకు రాజ్యాంగంలో కూడా ప్రస్తావని లేదని సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. అయితే అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దాని చుట్టూ ఉన్న వివాదాలు ఏమిటి? ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. దీంతో వాటిని భారత యూనియన్‌లో కలుపుకోవడానికి నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజాం అధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ క్రమంలోనే భారతదేశంలో విలీనం చేశారు. ఈ క్రమంలోనే స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్ము కశ్మీర్‌ను కూడా భారత్‌లో విలీనం చేయడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ జమ్ము కశ్మీర్‌ను భారత్‌లో కలపడానికి ఆ ప్రాంత రాజుగా ఉన్న మహారాజా హరి సింగ్ మూడు షరతులు విధించారు. అవి విదేశీ వ్యవహరాలు, రక్షణ, కమ్యూనికేషన్స్. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై చర్చలు జరిపారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. ఈ ఆర్టికల్ 370ని షేక్ అబ్దుల్లా రూపొందించారు. దీనిని ఆమోదించడంతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం అయింది. కానీ జమ్ము కశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రతిపత్తిని కల్పించారు. రాష్ట్రపత్తి ఉత్తర్వు ఆధారంగా 1954 మే 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 1956 ఫిబ్రవరి 11- 1994 ఫిబ్రవరి 19 మధ్య నలభై ఏడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆర్టికల్ 370లోని నిబంధనలు
ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయాల్లో మినహా ఇతర అంశాల్లో జమ్ము కశ్మీర్‌లో చట్టాలను అమలు చేయాలంటే పార్లమెంట్‌కు అక్కడి రాష్ట్రప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే జమ్ము కశ్మీర్‌కు భారత్ రాజ్యాంగంతోపాటు మరో ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉంటుంది. జమ్ము కశ్మీర్ ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం దేశంలోని మిగిలిన ప్రాంతాల వారికి భిన్నంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాల వారు జమ్ము కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేయలేరు. అలాగే అక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు.
వివాదాలు
భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత జమ్ము కశ్మీర్‌ను తమలో విలీనం చేసుకోవడానికి పాకిస్థాన్ అనేక ప్రయత్నాలు చేసింది. ఆర్టికల్ 370 ప్రకారం షరతులతో జమ్ము కశ్మీర్ భారత్‌లో విలీనం అయింది. అప్పటి నుంచి కశ్మీర్ విషయమై భారత్, పాకిస్థాన్ మధ్య నిత్యం వివాదం రగులుతునే ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్ము కశ్మీర్‌లో భారత చట్టాలను నేరుగా అమలు చేయడానికి వీలుపడకపోవడంతో దీనిని చాలా మంది వ్యతిరేకించారు. దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన హక్కులు ఉండాలనే వాదనలు బలపడ్డాయి. దీని కోసం ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. జమ్ము కశ్మీర్ అభివృద్దికి కూడా ఆర్టికల్ 370 అడ్డుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆర్టికల్ 370 రద్దు
దీంతో 2019 ఆగష్టు 5న కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసింది. అలాగే జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అవి ఒకటి జమ్ము కశ్మీర్ కాగా, మరొకటి లఢఖ్. ఇది 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జమ్ము కశ్మీర్‌లోని స్థానికులతోపాటు రాజకీయ నాయకులు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో మొత్తం 23 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ పటిషన్లపై ఈ ఏడాది ఆగష్టు 2న అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. 16 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పునే దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-11T13:19:08+05:30 IST