Andhra Pradesh Weather: జనవరిలోనూ చలి పంజా
ABN, Publish Date - Jan 03 , 2026 | 05:11 AM
రాష్ట్రంలో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది. ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ భారతాల్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు చలి వాతావరణం నెలకొంటుంది.
ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా నమోదు
దక్షిణ కోస్తా, సీమల్లో సాధారణం.. లేదా కాస్త తక్కువ
సంక్రాంతి తరువాత స్వల్పంగా పెరగనున్న ఎండలు
భారత వాతావరణ విభాగం వెల్లడి
విశాఖపట్నం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది. ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ భారతాల్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు చలి వాతావరణం నెలకొంటుంది. అతి శీతల గాలులు వీచే అవకాశం ఉండటంతో చలి ప్రభావం ఉండే రోజుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానుంది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో చలి తీవ్రత ఎక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరుగా లేదా తక్కువగా ఉంటుంది. సంక్రాంతి తరువాత ఉత్తర కోస్తాలో ఎండ తీవ్రత స్వల్పంగా పెరగనుంది. జనవరి, ఇంకా జనవరి నుంచి మార్చి వరకు దేశంలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం... జనవరిలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతాయి. మధ్య, పశ్చిమ, తూర్పు భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా, ఉత్తర, తూర్పు/ఈశాన్య భారతంలోని కొన్నిచోట్ల ఎక్కువగా, దక్షిణాదిలో సాధారణంగా నమోదవుతాయి. జనవరిలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, ఉత్తర, ఈశాన్య భారతం, తమిళనాడుల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. కాగా, 2025లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో తీవ్రస్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. 1991-2020 మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు పరిగణనలోకి తీసుకుని గణించిన దీర్ఘకాల సగటు కంటే గతేడాది దేశవ్యాప్తంగా భూఉపరితల ఉష్ణోగ్రతలు 0.28 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వాతావరణ శాఖ వద్ద ఉన్న రికార్డుల మేరకు 1901 నుంచి ఇప్పటివరకూ నమోదైన 8 అత్యంత వేడి సంవత్సరాల్లో 2025 ఒకటి. 2011 నుంచి 2025 వరకు పది వేడి సంవత్సరాలు, 2016 నుంచి 2025 వరకూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - Jan 03 , 2026 | 05:19 AM