US President Donald Trump: ఆందోళనకారులను చంపుతుంటే..చూస్తూ ఊరుకోబోం!
ABN, Publish Date - Jan 03 , 2026 | 02:49 AM
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం, పెరిగిన ధరలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు 50నగరాలకు విస్తరించాయి. మరోవైపు ఆ ఆందోళనలను కఠినంగా అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది...
ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
టెహ్రాన్, వాషింగ్టన్, జనవరి 2: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం, పెరిగిన ధరలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు 50నగరాలకు విస్తరించాయి. మరోవైపు ఆ ఆందోళనలను కఠినంగా అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భద్రతా బలగాలు నిరసనకారులపై బాష్పవాయుగోళాలు, లాఠీచార్జిలతో విరుచుకుపడుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీ సంఖ్యలో ఆందోళనకారులకు గాయాలయ్యాయి. శుక్రవారం నాటికల్లా ఏడుగురు మరణించారు కూడా. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిపై ఇరాన్ హింసకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆందోళనకారులను అమెరికా రక్షిస్తుందని.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌లో ఆందోళనల వెనుక ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా, అమెరికా నుంచి ఆర్థిక, సైనికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వెనెజువెలా ప్రభుత్వం.. తమ దేశంలో ఉన్న ఐదుగురు అమెరికన్లను అరెస్టు చేసింది.
నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది
‘‘ట్రంప్ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాల్లో నిద్రపోతున్నారు’’ అని వస్తున్న వార్తలపై ట్రంప్ స్పందించారు.ప్రస్తుతం తన ఆరోగ్యం భేషుగ్గా ఉందన్నారు. కాకపోతే వైద్యులు సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆస్ర్పిన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. తన చెవులకు ఎలాంటి సమస్యా లేదన్నారు.
Updated Date - Jan 03 , 2026 | 02:49 AM