Savitribai Phule: ఆధునిక విద్యాభారతి వైతాళికురాలు
ABN, Publish Date - Jan 03 , 2026 | 04:12 AM
మహిళలు, దళితులు, శూద్రులు చదువు పొందకూడదనే కఠినమైన సామాజిక ఆంక్షలు ఉన్న కాలంలో, వాటన్నిటినీ ఛేదించి విద్య మాత్రమే విముక్తికి మార్గమని నిరూపించిన ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే.
మహిళలు, దళితులు, శూద్రులు చదువు పొందకూడదనే కఠినమైన సామాజిక ఆంక్షలు ఉన్న కాలంలో, వాటన్నిటినీ ఛేదించి విద్య మాత్రమే విముక్తికి మార్గమని నిరూపించిన ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే. అణచివేత, అవమానం, అపహాస్యం వంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా సమానత్వం, మానవత్వం, న్యాయం అనే విలువల కోసం ఆమె అలుపెరుగకుండా పోరాడారు. ఆమె దృష్టిలో చదువనేది కుల, లింగ వివక్ష నుంచి విముక్తి పొందే ఆయుధం. ఇలాంటి పోరాటాల ఫలితంగానే బాలికల విద్య, దళితుల చదువు, వితంతువుల జీవితాల్లో వెలుగు మొదలైనాయి.
సావిత్రిబాయి ఫూలే కేవలం బోధనకే పరిమితం కాలేదు. అనాథల, వితంతువుల, రోగుల సేవలోనూ పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మానవీయ విలువలను జోడించారు. భారతీయ సమాజంలో అట్టడుగువర్గాల జీవితాల్లో ప్రత్యక్షంగా సంస్కరణలు తీసుకొచ్చిన తొలి వ్యక్తిగా ఆమెను పరిశీలిస్తే, సావిత్రిబాయి ఫూలే నిజమైన మొదటి సంఘసంస్కర్త. సమాజం కోసం జీవించి, సమాజం కోసం మరణించిన వ్యక్తి మాత్రమే అసలైన సంఘసంస్కర్త అవుతారు. ఆ ప్రమాణానికి పూర్తిగా సరిపోయిన తొలి వ్యక్తి ఆమె.
సావిత్రిబాయి ఉద్యమం సమగ్ర మానవ విముక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళ, శూద్రుడు, అతిశూద్రుడు అనే భేదాలను ఒక్కరీతిగా ప్రశ్నించిన సంస్కర్త ఆమె. సమకాలీన సంస్కర్తలు సమాజంలోని ఒక్కో అన్యాయాన్ని మాత్రమే ఎదుర్కొంటే, ఆమె మూల వ్యవస్థలనే ప్రశ్నించారు. అందుకే ఆమెను కేవలం ఒక మహిళా సంస్కర్తగా కాకుండా, భారతదేశంలోని అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కర్తగా గుర్తించాలి. నేటి మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి నిజమైన ఆదర్శం. ఆమె ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాక, సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారు. తీవ్రమైన సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారు. ఆడపిల్లలకు చదువు అందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న దూరదృష్టితో బోధించారు. ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆయా రోగులకు సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం ఆమె త్యాగభావానికి పరాకాష్ఠ. నేటి మహిళా ఉపాధ్యాయులంతా సావిత్రిబాయిని ఒక చారిత్రక వ్యక్తిగా మాత్రమే కాక, వృత్తి నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా చూడాలి. ఆమె జీవితాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన గౌరవం వస్తుంది.
సావిత్రిబాయి ఫూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపడం గౌరవప్రదమైన విషయమే. అయితే ఆమె ఆశయాలు కేవలం సభలు, ప్రసంగాలు, పూలమాలలకే పరిమితమైతే అది ఆమె చేసిన త్యాగానికి న్యాయం చేసినట్లు కాదు. ఆమె జీవితమంతా ఆచరణాత్మక పోరాటమే; కాబట్టి ఆమెను స్మరించుకోవడం కూడా కార్యాచరణ రూపంలోనే ఉండాలి. మహిళా విద్య, దళిత– వెనుకబడిన వర్గాల చదువు, సమానత్వం, ఆత్మగౌరవం... ఇవే సావిత్రిబాయి ప్రధాన లక్ష్యాలు. నేటి కాలంలో కూడా బాలికల డ్రాప్ అవుట్లు, విద్యలో అసమానతలు, సామాజిక వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని నిర్మూలించేందుకు నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, బాలికలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, పేద విద్యార్థులకు నిరంతర సహాయం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యను కేవలం డిగ్రీలకే పరిమితం చేయకుండా, ప్రశ్నించే చైతన్యం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా రూపొందించాలి. అప్పుడే సావిత్రిబాయి ఆలోచనలు సజీవంగా నిలుస్తాయి. అందువల్ల, ప్రభుత్వం సావిత్రిబాయి జయంతిని జరపడం కంటే, ప్రధానంగా ఆమె లక్ష్యాలను కొనసాగించే విధానాలు అమలు చేయడమే నిజమైన నివాళి అవుతుంది.
-జుర్రు నారాయణయాదవ్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ టీచర్స్ యూనియన్
(నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి)
Updated Date - Jan 03 , 2026 | 04:13 AM