National Identity: భారత్ భావనకు ‘విద్వేష’ ఉపద్రవం
ABN, Publish Date - Jan 03 , 2026 | 04:18 AM
నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతించిన సంవత్సరం (2025)లో మీ మనసుపై ముద్ర వేసిన ప్రభావం లేదా ఘటన ఏమిటి? శాశ్వతంగా నిలిచిపోయే దాని జ్ఞాపకాన్ని సువ్యక్తం చేసే పదం ఏమిటి?
నూతన సంవత్సర శుభాకాంక్షలు. గతించిన సంవత్సరం (2025)లో మీ మనసుపై ముద్ర వేసిన ప్రభావం లేదా ఘటన ఏమిటి? శాశ్వతంగా నిలిచిపోయే దాని జ్ఞాపకాన్ని సువ్యక్తం చేసే పదం ఏమిటి? ఈ సువిశాల దేశంలో అత్యధిక ప్రజలను కదిలించిన మాట ఏమిటి?
2025 సంవత్సరం మనలో మిగిల్చిన మన్నికైన జ్ఞాపకం ‘సిందూర్’. పహల్గాంలో అమానుష ఉగ్రవాద దాడికి పాల్పడింది ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులు. ఈ పాకిస్థానీ దుండగులకు ఆశ్రయమిచ్చి, వారి ఘాతుకానికి సహకరించినది ఇద్దరు భారతీయులు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. పహల్గాం హత్యాకాండకు భారత ప్రభుత్వ ప్రతిస్పందనే ‘ఆపరేషన్ సిందూర్’. ఈ సైనిక చర్యలో భారత వాయుసేన, క్షిపణులు, డ్రోన్‌లు పాకిస్థాన్ సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించాయి. మన దేశానికీ కొంత నష్టం సంభవించింది (ఏ యుద్ధంలోనైనా ఇది అనివార్యం). ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులు ఒక ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన ఇద్దరు భారతీయుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆపరేషన్ సిందూర్ నిర్వహణ, సాధించిన ఫలితాలపై ఇప్పటికీ పారదర్శకత కొరవడింది. కేవలం నాలుగు రోజులు మాత్రమే జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశ ప్రజల మనసులపై శాశ్వత ప్రభావం కలిగించేంత సుదీర్ఘ యుద్ధం కాదు.
2025లో భారత్‌ను నిర్వచించేందుకు యుక్తమైన మరో పదం ‘టారిఫ్’. ఆ సేతు హిమాచలం అశేష ప్రజల మాటామంతీ, పిచ్చాపాటీలో ప్రస్తావితమైన, ఇంకా ప్రస్తావితమవుతోన్న పదమది. దానికి దీటైన మరొక పదం ‘ట్రంప్’ మాత్రమే! ట్రంప్ టారిఫ్‌లు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను సంక్లిష్ట సమస్యల్లోకి నెట్టివేశాయి. చాలా దేశాల్లో ఈ సమస్యలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఉదాహరణకు అమెరికాకు భారత్ ఎగుమతులపై ప్రతీకార సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా విధింపులు కొనసాగుతున్నాయి. అమెరికాకు భారత్ చేస్తున్న– ఉక్కు, అల్యూమినియం, జౌళి ఉత్పత్తులు, ముత్యాలు, ఆభరణాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతులను ట్రంప్ సుంకాలు ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ‘సమీప భవిష్యత్తు’లో కుదరనున్నదని 2025 ఏప్రిల్‌లో వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. 2025 సంవత్సరం ముగిసిపోయింది. ఇప్పటికీ ఆ ఆశావహ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చాలా సుదూర విషయంగానే కనిపిస్తోంది మరి.
జీఎస్టీ (వస్తుసేవల పన్ను) మరొక యుక్తమైన పదంగా చెప్పవచ్చు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ పన్ను వ్యవస్థ ప్రారంభమయింది. వినియోగదారులకు, వ్యాపార వర్గాలకు అదొక ఉపద్రవం. సముచిత సలహాలు, సూచనలకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానే అయినప్పటికీ సానుకూలంగా ప్రతిస్పందించింది. చాలా సరుకులు, సేవలపై జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించింది. అయినప్పటికీ వర్తకులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు పాలనా యంత్రాంగాల నుంచి వేధింపులు, చికాకులు తప్పడం లేదు. కొంతమంది వ్యాపారులు అయితే ఇప్పటికీ జీఎస్టీ విషయంలో తికమక పడుతూనే ఉన్నారు. జీఎస్టీ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించడంలో తమకు ఎదురవుతున్న కష్ట నష్టాలకు వర్తకులు, వ్యాపారులు ఎంతో మంది గుండెలు బాదుకుంటూనే ఉన్నారు. కొన్ని ముఖ్యమైన సరుకులపై పన్ను రాయితీ కల్పించారు. అయితే వాటి వినియోగ పరిమాణంతో పోల్చితే ఆ రాయితీ చాలా స్వల్పమైనది మాత్రమే. జీఎస్టీపై ఇచ్చిన రాయితీలతో వినియోగం ఇతోధికంగా పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే దేశ జనాభాలో అధిక ఆదాయమున్న పదిశాతం ప్రజల వినియోగం మాత్రమే పెరిగింది. చెప్పవచ్చిన దేమిటంటే జీఎస్టీ ఇప్పటికీ సామాన్య వినియోగదారులకు చికాకు కలిగిస్తూనే ఉన్నది.
2025 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు ‘Goldilocks year’ (స్థిరమైన, మితమైన వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, తక్కువ నిరుద్యోగంతో ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లిన అరుదైన సంవత్సరం) అని ప్రభుత్వం ఆర్భాటంగా చాటింది. అయితే ఈ ప్రచారార్భాటం చాలా త్వరితంగానే అంతరించిపోయింది. ఆ ఘనమైన మాట–గోల్డిలాక్స్ ఇయర్’ సూచించే విషయాలు విద్యాధికులకే అపరిచితమైనవి. దీనికి తోడు దేశ జాతీయ గణాంకాల విశ్వసనీయతను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంస్థ ప్రశ్నించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనతల గురించి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు మొదలు అర్థశాస్త్ర ఘనాపాఠీలు అయిన విశ్వవిద్యాలయాల ఆచార్యుల వరకూ ఎందరో మాట్లాడారు. అయితే ఉద్యోగాలకై యువజనులు చేసిన ఆందోళనలతో ప్రభుత్వ ప్రాయోజిత ‘గోల్డిలాక్స్ ఇయర్’ ప్రచారం నిలిచిపోయింది. నిజానికి ప్రధాన ఆర్థిక మాజీ సలహాదారు, తదితరులు చెబుతున్న వాటికంటే చాలా బలహీనతలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. వాటిని అంగీకరించేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇంకా చెప్పాలంటే... బహుశా, ఆ బలహీనతలను అర్థం చేసుకునేందుకు సైతం ప్రభుత్వం నిరాకరిస్తోంది.
సరే, ఒకప్పుడు అందరూ ‘లౌకికవాదం’ అనే పదాన్ని ప్రస్తావిస్తుండేవారు. లౌకికవాద విలువల గురించి మాట్లాడుతుండేవారు. అయితే ఇప్పుడు ఆ పదం ఎక్కడా విన్పించడం లేదు. తమనుతాము లౌకికవాదులుగా చెప్పుకునే వారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. రాజ్య వ్యవస్థ కార్యకలాపాల నుంచి మత ప్రమేయ వ్యవహారాలను వేరు చేయడమే లౌకికవాదం. అయితే మత సిద్ధాంతాలపై కాకుండా హేతువు, మానవతావాదంపై లౌకికవాది విలువలు ఆధారపడి ఉంటాయనే అర్థాన్ని ఆ పదం కాలక్రమేణా సంతరించుకున్నది.
లౌకికవాద విలువల, విశ్వాసాల తిరోగమనం విద్వేషం ప్రబలిపోయేందుకు దారితీసింది. ప్రతి మతమూ గర్హించిన మానవ స్వభావమది. విద్వేష ప్రసంగాలు, విద్వేష రచనలుగా చెప్పదగినవాటిలో అత్యధికం మతం ఆధారితమైనవి. జాతి, భాష, కులం కూడా చాలామందిలో విద్వేష వైఖరులకు ఆధారంగా ఉన్నాయి. విద్వేష వైఖరులకొక స్పష్టమైన తార్కాణం ముస్లింల పట్ల ద్వేషం. వారి వస్త్రధారణ, ఆహార అలవాట్లు, ప్రార్థనా ప్రదేశాల పట్ల ఇతరుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ కారణంగానే ముస్లింల ‘నమాజ్’ (ప్రార్థన)కు అంతరాయం కలిగించడం, ఆ మతాచారాలపై ఆంక్షలు విధించడం జరుగుతోంది.
తోటి భారతీయులు అయిన ముస్లింల పట్ల ఇలా ఎందుకు వ్యతిరేకత ప్రబలిపోతోంది? సుదూర ప్రాంతాలకు చెందిన ముస్లింలు భారత్‌ను దురాక్రమించి ఆరు శతాబ్దాల పాటు పరిపాలించారని, ముస్లింలకు ఈ దేశంలో వారి స్థానమేమిటో చూపే సమయం ఇప్పుడు ఆసన్నమయిందని, హిందువులు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని... ముస్లింలను ద్వేషించే పలువురు వాదిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే వాదన, సందేహం లేదు. ముస్లింల మీదే కాదు, మరో మైనారిటీ మతమైన క్రైస్తవం పట్ల కూడా ఆగ్రహం ప్రచండంగా వ్యక్తమవుతోంది. క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేస్తున్నారు. క్రైస్తవ పూజారులు, మతాచార్యులు, క్రైస్తవ ధర్మ ప్రచారకులను హతమారుస్తున్నారు. జీసస్ స్తుతి గీతాలు గానం చేస్తున్న క్రైస్తవ బాలలపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఆగడాలన్నీ హిందూ ‘హక్కుల’ను రక్షించడం పేరిట జరుగుతున్నాయి!
హిందూ మత ఆధిపత్య భావనను ఏవగించుకున్నంతగా మరే భావనను భారత రాజ్యాంగం అసహ్యించుకోదు, వ్యతిరేకించదు. భారత్ భావన (ఐడియా ఆఫ్ ఇండియా)కు పునాది పౌరసత్వమే కానీ మతం ఎంత మాత్రం కాదు. అలాగే కులం లేదా జాతి లేదా భాష కూడా భారతీయ భావనకు ప్రాతిపదికలు కావు. భారతీయులలో అత్యధికులు డాక్టర్ అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా ఉదాత్త జీవితాల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వారిని పూజ్యభావంతో స్మరించుకోవడం తమ భారతీయతకు చిహ్నంగా విశ్వసిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రగిలించి వ్యాపింపజేస్తున్న భారతీయుల సంఖ్య చాలా చాలా స్వల్పం.
ఈ విద్వేష పర్వంలో అత్యంత ఆందోళనకరమైన విషయం మైనారిటీ మతాల వారిపై దాడులను శాసన సమ్మతం చేసే ప్రయత్నమే. రాజ్య వ్యవస్థ, ఉన్నత పదవులలో ఉన్న నాయకులు, ప్రభుత్వాల అండదండలతో పెట్రేగిపోతున్న కొన్ని సంఘాలు ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు ప్రధాన బాధ్యులు. వారి మాటలు, చేతలు లేదా మౌనం విద్వేషకారులు చెలరేగిపోయేందుకు ప్రోత్సాహమిస్తున్నాయి. ఆ విద్వేష దాడులు మానవతను కాలరాసివేసేవే. ఈ ధోరణి కొనసాగడం భారతీయ సమాజానికి చేటుచేస్తున్నది. భారత గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు ఏది జరగకూడదని సంకల్పించారో అదే సంభవిస్తున్నది. సంకుచితత్వాల ఇరుకు గోడల మధ్య మన మహోన్నత పురానవజాతి మరొకసారి ముక్కలు ముక్కలయి పోగలదు. ఈ అరిష్టం సంభవించకుండా అడ్డుకోవడం భారతీయ పౌరుల విధ్యుక్త ధర్మం. ఆవేదన, ఆగ్రహం, అమితమైన వ్యాకులత, అంతకు మించిన తలవంపులతో గతించిన సంవత్సరం (2025)లో భారతదేశాన్ని నిర్వచించే పదంగా ‘విద్వేషం’ను ఎంచుకున్నాను.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Jan 03 , 2026 | 04:22 AM