Uttam: సామాజిక న్యాయం.. కాంగ్రెస్ సిద్ధాంతం
ABN, Publish Date - Jul 12 , 2025 | 03:56 AM
సామాజిక న్యాయం కాంగ్రెస్ సిద్ధాంతమని, బీసీ గణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించడం..
బీసీలకు 42% రిజర్వేషన్‌తోనే రానున్న ఎన్నికలు
త్వరలో 5 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
14న ప్రారంభించనున్న సీఎం: ఉత్తమ్
తిరుమలగిరి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం కాంగ్రెస్ సిద్ధాంతమని, బీసీ గణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించడం.. తమ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుండనడానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీసీ రిజర్వేషన్‌పై క్యాబినెట్ తీర్మానం చేశామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్‌తోనే రానున్న ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 14న సీఎం పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 5లక్షల రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. సన్న బియ్యంతో రూ.3.10కోట్ల మందికి (84శాతం జనాభాకు) అన్నం పెడుతున్నామని, ఇది గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నామన్నారు.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కొత్త కార్డులు ఇవ్వడంతోపాటు పాత కార్డుల్లో సభ్యులను చేరుస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా గత ఏడాది రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. యాసంగిలో 75లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రాంతాలు బాగుండడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కేవలం కమీషన్ల కోసమే పనిచేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందని అన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 03:56 AM