Uttam Kumar Reddy: 2 రోజుల్లో సర్వే వివరాలు కొన్ని వెల్లడిస్తాం
ABN, Publish Date - Feb 06 , 2025 | 03:36 AM
కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే బీసీ, ఎస్టీ జనాభా పెరిగింది.. ఓసీ జనాభా మాత్రం తగ్గింది
కులగణన వివరాలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తాం
సర్వేపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే మొత్తం వెయ్యి పేజీల డాక్యుమెంట్ అని, ఇందులో కొన్ని వాల్యూమ్‌లను ఒకటి, రెండు రోజుల్లో పబ్లిక్ డొమైన్‌లో పెడతామని చెప్పారు. ఈ డాక్యుమెంట్‌లో వ్యక్తిగత సమాచారం ఉన్న వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టేందుకు వీలు లేదన్నారు. బుధవారం కులగణన సర్వేపై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని ఉత్తమ్ చెప్పారు. ఆ సర్వేలో బీసీ జనాభా 51.09 శాతంగా పేర్కొంటే.. తమ సర్వేలో 56.33 శాతానికి పెరిగిందన్నారు.
అలాగే ఎస్టీ జనాభా 9.8 నుంచి 10.45 శాతానికి పెరిగిందని చెప్పారు. అదే ఓసీ జనాభా 21.55 శాతం నుంచి 15.79 శాతానికి తగ్గిందని వెల్లడించారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన కులగణన సర్వే ఇదని.. ఈ సర్వేపై విపక్షాలు తప్పుడు గణాంకాలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కులగణన సర్వే వివరాలను సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తామని చెప్పారు. సర్వేను శాస్త్రీయంగా నిర్వహించడానికి 1.03 లక్షల మంది శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు 55 రోజుల పాటు కృషి చేశారని అన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ సర్వేలో పాల్గొనడం.. సర్వే ప్రామాణికతకు అద్దం పడుతుందన్నారు. సర్వే అనంతరం సీజీజీ ఆధ్వర్యంలో 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో డేటాను విశ్లేషించి డిజిటలైజ్ చేశారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటంబ సర్వే.. పబ్లిక్ డాక్యుమెంట్ కాదని, దాన్ని అసెంబ్లీలో పెట్టలేదని చెప్పారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో.. క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారాన్ని యథాతథంగా పొందుపరిచామని స్పష్టం చేశారు.
సర్వేలో పాల్గొనని వారు వివరాలిస్తే తీసుకుంటాం: భట్టి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఇదివరకు వివరాలివ్వని వారు మళ్లీ ఇవ్వొచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పేరు, కుటుంబ వివరాలు చెబితే తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఇలాంటి కులగణన సర్వే దేశవ్యాప్తంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కొన్ని దశాబ్దాలుగా కొన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను శాసనసభలో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సర్వే... ప్రజల వివిధ రకాల స్థితిగతులకు సంబంధించి ఒక ఫుల్ బాడీ చెకప్ అని, ఒక ఎక్స్‌రేలాంటిదన్నారు.
బీసీలు ఘనం.. నివేదిక సాక్ష్యం..
ఆ డప్పు గుండె చప్పుడు తెలిసినోడిని..
కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం ట్వీట్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై వేర్వేరుగా తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. బీసీలకు సంబంధించి ‘‘బీసీలు ఘనం.. నివేదిక సాక్ష్యం. నిన్నటి కాకిలెక్కలు కాదు.. ఇవీ నేటి నికార్సైన లెక్కలు’’ అంటూ పోస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణపై స్పందిస్తూ.. ‘‘ఆ డప్పు గుండె చప్పుడు తెలిసినోడిని.. విపక్షంలోనే వర్గీకరణపై సభలో రణం చేసినోడిని. సోదరుడు సంపత్ సాక్షిగా ఆనాడు ప్రతినభూని.. ఈనాడు వర్గీకరణపై ఆచరణలో అడుగు ముందుకువేసి.. దేశానికి మార్గం చూపించాం. ఈ ఆనంద క్షణాన గాంధీ భవన్ వేదికగా సోదరుల డప్పుల చప్పుళ్లు చిరకాలం గుర్తుండే జ్ఞాపకాలు’’ అని పేర్కొంటూ గాంఽధీభవన్‌లో నిర్వహించిన సంబురాల వీడియోను పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..
Updated Date - Feb 06 , 2025 | 03:36 AM