Niloufer Hospital: నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
ABN, Publish Date - May 23 , 2025 | 05:50 AM
ప్రభుత్వ అనుమతుల్లేకుండా నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమంగా నిర్మిస్తున్న మెడికల్ షాప్‌ను గురువారం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
సూపరింటెండెంట్ తీరుపై హెల్త్ సెక్రటరీ, హైదరాబాద్ కలెక్టర్ మండిపాటు
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అనుమతుల్లేకుండా నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమంగా నిర్మిస్తున్న మెడికల్ షాప్‌ను గురువారం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో జ్యోతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కట్టడాన్ని కూల్చివేశారు. ఆస్పత్రి ఆవరణలో మెడికల్ షాప్ ఏర్పాటు కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా మంగళవారం సాయంత్రం గది నిర్మాణం చేపట్టారు. రాత్రికి రాత్రే గోడల నిర్మాణం పూర్తయింది. అక్రమ నిర్మాణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు.. దాని తొలగింపునకు చర్యలు చేపట్టారు.
దీనిపై నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్ స్పందిస్తూ.. సీఎంఓ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్థూ, హైదరాబాద్ కలెక్టర్ అనుమతితో నిర్మిస్తున్నట్లు చెప్పడంతో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సూపరింటెండెంట్‌పై మంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, సీఎంఓ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ నిర్మాణాన్ని రెవన్యూ అధికారులు కూల్చేసిన తర్వాత నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఓ ప్రకటన చేస్తూ.. జెనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు కోసం తాత్కాలికంగా ఓ గది సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 05:51 AM