Tummala: రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారా?
ABN, Publish Date - Jan 19 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతులు బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
రైతు దీక్షలంటూ విన్యాసాలు చేస్తున్నారు
బీఆర్‌ఎ్‌స నేతలపై మంత్రి తుమ్మల ఫైర్
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతులు బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. వారి హయాంలో పంట నష్టపోయిన రైతులను ఏనాడైనా ఆదుకున్నారా అని నిలదీశారు. రైతు బంధు పేరుతో పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దీక్షల పేరుతో బీఆర్‌ఎస్ చేస్తున్న కొత్త విన్యాసాలు, వారి ప్రకటనలను చూసి తెలంగాణ రైతాంగం నవ్వుకుంటున్నారన్నారు. ఇటీవల రైతులు, రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై మాట్లాడుతన్న సందర్భంగా బీఆర్‌ఎస్ హాయాంలో అమలుచేసిన పథకాలు, వాటి వివరాలు, ప్రస్తుత తమ ప్రభుత్వం అందిస్తున్న రైతు పథకాలు, వివరాలను మంత్రి తుమ్మల శనివారం మీడియాకు విడుదల చేశారు.
‘‘రైతు సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదే ళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా సరైన కేటాయింపులు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రైతు సంక్షేమం కోసం ప్రత్యక్షంగా రూ.29,897 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ.32వేల కోట్లను మద్దతు ధరతో పంటల సేకరణకు, ఉచిత విద్యుత్‌కు ఖర్చుచేశాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణ మాఫీని ఏకకాలంలో చేయకపోవడం వలన రైతులపై రూ.8,515కోట్ల భారం పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేసింది. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేశాం. మరో 3,13,896 మంది రైతులకూ మరో రూ.2,747.67 కోట్ల రుణాలను మాఫీ చేశాం. రైతుబంధును పదేళ్లలో కేవలం రెండు సందర్భాలలో తప్ప ఎప్పుడూ 4 నెలలోపు చెల్లించలేదు. ఈ ఏడాది రైతుభరోసా ద్వారా ఎకరానికి రూ.6వేల చొ ప్పున జనవరి 26నుంచి ఇవ్వనున్నాం. గత ప్రభు త్వం ఏ పంటకూ బోనస్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోన్‌సను ప్రకటించింది’’ అని తుమ్మల వివరించారు.
Updated Date - Jan 19 , 2025 | 04:28 AM