Siddipet: నలుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి.. భార్యాభర్తల ఆత్మహత్య
ABN, Publish Date - Mar 17 , 2025 | 04:30 AM
ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకున్న తీవ్ర నిర్ణయాలు అభంశుభం తెలియని నలుగురు చిన్నారులను రోడ్డున పడేశాయి.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత మరొకరు బలవన్మరణం
సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో విషాదం
తొగుట, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకున్న తీవ్ర నిర్ణయాలు అభంశుభం తెలియని నలుగురు చిన్నారులను రోడ్డున పడేశాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల పోషణ భారంగా మారిందనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన భార్య మరణించిందనే వార్త విన్న కాసేపటికే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వారి సంతానం అనాథలుగా మిగిలారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు (35) మొదటి భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆ దంపతులకు మీనాక్షి(9), మహేష్ (7) అనే సంతానం ఉన్నారు. మొదటి భార్య మరణించడంతో నాగరాజు.. రామాయంపేటకు చెందిన భాగ్య (32)ను రెండో వివాహాం చేసుకున్నాడు. వీరికి లక్ష్మి(5), శ్రావణ్(4) అనే పిల్లలు ఉన్నారు. నాగరాజు కుటుంబం స్థానికంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసముంటోంది. కూలీపనులు చేసుకుని నాగరాజు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు.
అయితే, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భాగ్య ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తమ ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. భాగ్య అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. అప్పటిదాకా అక్కడే ఉన్న నాగరాజు భార్య మరణవార్త విన్న వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి తన కుటుంబీకులకు ఫోన్ చేసి తాను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కట్ చేశాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నాగరాజు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతడు ఉన్న లొకేషన్‌ను వెళ్లారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలోని చెట్ల మధ్య అచేతనంగా పడి ఉన్న నాగరాజును రాత్రి ఎనిమిది గంటలప్పుడు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసిన తొగుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ స్వామి. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పోచయ్య, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు దేవరాయ ఎల్లం తదితరులు కోరారు.
Updated Date - Mar 17 , 2025 | 04:30 AM