Maoist Encounter: బీజాపూర్‌లో మరో ఎన్‌కౌంటర్!
ABN, Publish Date - Jun 07 , 2025 | 05:16 AM
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు.
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతి.. ఏకే 47 స్వాధీనం
అతని స్వస్థలం ఆదిలాబాద్
చర్ల/మంచిర్యాల/ఆసిఫాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. గురువారం ఇదే అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, బలగాల మధ్య అడపా దడపా ఎన్‌కౌంటర్లు జరిగాయని బీజాపూర్ పోలీసులు తెలిపారు. అలా జరిగిన ఎదురుకాల్పుల్లో భాస్కర్ మరణించాడని, అతని వద్ద నుంచి ఏకే47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతను కొమురంభీం, మంచిర్యాల ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో పేలుడు వస్తువులు, విప్లవ పుస్తకాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నేషనల్ పార్కు అడవుల్లో కూంబింగ్ జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌జిల్లా బోథ్ మండలం పొచ్చర్లకు చెందిన అడెల్లు అలియాస్ భాస్కర్ 1995లో సాయుధ పోరాటం వైపు అడుగులు వేశాడు. జిల్లాలోని రామకృష్ణాపూర్‌లో ఆర్‌ఎంపీ వైద్యుడిగా ఉన్నప్పుడే పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఉత్తర తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఆ పార్టీలో పనిచేశాడు. అనంతరం మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. భాస్కర్‌పై 30కి పైగా కేసులు ఉన్నాయి. రూ.25 లక్షల రివార్డు ఉంది.
ఇద్దరినీ పట్టుకొని చంపారా?
సుధాకర్, భాస్కర్‌లు వరుస ఎన్‌కౌంటర్లలో మరణించడం గమనార్హం. ఈ ఎన్‌కౌంటర్లలో ఇతర మావోయిస్టులు ఎవరూ మరణించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి రక్షణ వలయం ఉంటుంది. కేవలం ఈ ఇద్దరే చనిపోవడంపై పలువురు పట్టుకొని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మీడియాలో వచ్చిన అడెల్లు ఫొటోలను చూసి తమ తమ్ముడేనని నిర్ధారించుకున్నామని అడెల్లు సోదరుడు సీతారం తెలిపారు. ప్రభుత్వం మృతదేహాన్ని పంపిస్తే అంత్యక్రియలు చేసి, రుణం తీర్చుకుంటామన్నారు.
ఏడుగురి లొంగుబాటు
ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోయినట్లు దంతెవాడ ఏఎస్పీ స్మితిక్ రాజనాల తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు
బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 07 , 2025 | 05:16 AM