Hyderabad: ఆర్టీసీలో సమ్మె సైరన్!
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:10 AM
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
సమస్యల పరిష్కారానికి జేఏసీ నిర్ణయం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
నేడు, రేపు నల్లబ్యాడ్జీలతో నిరసన
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల కాలంలో ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.
దీని వల్ల ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. పనిభారం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించడం లేదని జేఏసీ నేతలు వెల్లడించారు. ఆర్టీసీ ఎండీకి సోమవారం మధ్యాహ్నం సమ్మె నోటీసులు ఇవ్వనున్న నేతలు సానుకూల నిర్ణయం రాకపోతే మార్చి మొదటి వారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. ప్రభుత్వానికి ఆర్టీసీపై ప్రేమ ఉంటే 5 వేల కోట్లు కేటాయించాలి. ఈవీ బస్సుల్ని స్వాగతిస్తున్నాం.. కానీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవే అంశాలపై సోమవారం సమ్మె నోటీసు ఇస్తున్నాం’’ అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న తెలిపారు. కాగా, కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతామని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే స్పష్టం చేశారు.
సీఎం, మంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరించండి
కేకేకు ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కె.కేశవరావుకు టీజీఎ్‌సఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) విజ్ఞప్తి చేసింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తదితరులు గురువారం కేకేను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘంలో కేకే సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయన్ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు వివరించి పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని కేకే భరోసా ఇచ్చారని రాజిరెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Updated Date - Jan 24 , 2025 | 04:10 AM