కీలక ఖనిజాల మైనింగ్‌లో క్వీన్స్‌లాండ్ సహకారం
ABN, Publish Date - Feb 25 , 2025 | 03:48 AM
దేశంలో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) మైనింగ్‌లో తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుందని.. ఖనిజాల సాంకేతికత, మైనింగ్ రంగంలో పరస్పర సహకారానికి క్వీన్స్‌లాండ్ (ఆస్ట్రేలియా) ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ఇరు రాష్ట్రాల మధ్య నోడల్ ఏజెన్సీగా సింగరేణి: భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) మైనింగ్‌లో తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుందని.. ఖనిజాల సాంకేతికత, మైనింగ్ రంగంలో పరస్పర సహకారానికి క్వీన్స్‌లాండ్ (ఆస్ట్రేలియా) ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం సింగరేణిభవన్‌లో భట్టితో క్వీన్స్‌లాండ్ మంత్రి రోస్‌బేట్స్ భేటీ అయ్యారు. రాష్ట్రంతో పాటు దేశంలో విద్యుత్తు వాహనాలు, సౌర విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌కు డిమాండ్ ఉందని.. ఈ రంగంలో అవసరమైన వెనాడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 కీలక ఖనిజాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని భట్టి అన్నారు. అయితే వీటి లభ్యత క్వీన్స్‌లాండ్‌లో అధికంగా ఉన్నందున వీటి ఉత్పత్తి, విక్రయం, పరస్పర లబ్ధి చేకూరే అంశంపై అవగాహనకు వచ్చామని తెలిపారు. 2029-30 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశంలో ఆదర్శంగా నిలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు క్వీన్స్‌లాండ్ సహకారం తీసుకుంటామన్నారు. క్వీన్స్‌లాండ్, తెలంగాణ మధ్య సంయుక్త మైనింగ్, ఖనిజ వ్యాపారానికి సింగరేణి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామన్నారు. త్వరలోనే అధ్యయనం కోసం సింగరేణి నుంచి ఒక బృందాన్ని క్వీన్స్‌లాండ్‌కు పంపుతామని తెలిపారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం కలిగిన సింగరేణితో ఇప్పటికే తమకు సంబంధాలున్నాయని క్వీన్స్‌లాండ్ మంత్రి రోస్‌బేట్స్ అన్నారు. రానున్న మార్చిలో క్వీన్స్‌లాండ్‌లో జరిగే వ్యాపార సదస్సుకు హాజరుకావాలని భట్టిని ఆహ్వానించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరాంతో పాటు క్వీన్స్‌లాండ్ అధికారులు పాల్గొన్నారు.
సాగుకు ప్రత్యేక నిధులు కేటాయించండి..
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని భట్టిని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు ఉపాధి హామీని అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Feb 25 , 2025 | 03:48 AM