గ్రామపంచాయతీ, అంగన్‌వాడీల భవన నిర్మాణాల ప్రక్రియ వేగవంతం
ABN, Publish Date - Jun 23 , 2025 | 04:48 AM
పల్లెల్లో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది.
ఇప్పటికే అనేక జిల్లాల్లో స్థలాల గుర్తింపు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది 1,148 అంగన్‌వాడీ భవనాలను నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 813 చోట్ల స్థలాలను గుర్తించారు. మండలానికి రెండు చొప్పున 1,144 గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా 549 గ్రామాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ప్రధానంగా భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్థలాల గుర్తింపునకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీంతో స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల ద్వారా ఒక్కో పంచాయతీ భవన నిర్మాణ కోసం రూ.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. అంగన్‌వాడీ భవనం కోసం ఉపాధి హామీ నిధుల ద్వారా రూ.8 లక్షలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.2 లక్షలు, మహిళా శిశు సంక్షేమం నుంచి రూ.2 లక్షలతో కలిపి రూ.12 లక్షలు వెచ్చించనున్నారు. మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఈ భవనాలన్నీ ఒకేలా ఉండేలా నమూనా రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. స్థలాల గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉన్న నేపథ్యంలో త్వరలో నూతన భవనాలకు శంకు స్థాపన చేస్తామని ఆమె తెలిపారు.
Updated Date - Jun 23 , 2025 | 04:48 AM