Bijapur: గణపతిని చుట్టుముట్టిన బలగాలు?
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:24 AM
బీజాపూర్ దండకారణ్యంలోని నేషనల్ పార్క్‌పై పోలీసు బలగాలు పట్టు సాధించాయా? వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రతినబూనిన కేంద్ర ప్రభుత్వం..
పీఎల్‌జీ కమాండర్ హిడ్మా కూడా అక్కడే??
బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలి
తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్
చర్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బీజాపూర్ దండకారణ్యంలోని నేషనల్ పార్క్‌పై పోలీసు బలగాలు పట్టు సాధించాయా? వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రతినబూనిన కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 25 వేల బలగాలను మోహరించిందా? మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితోపాటు.. గెరిల్లా తంత్రాల్లో ఆరితేరిన పీఎల్‌జీ ఒకటో బెటాలియన్ కమాండర్ మాడ్వీ హిడ్మా, మరో అగ్రనేత దేవాను బలగాలు చుట్టుముట్టాయా? ఈ ప్రశ్నలకు అటు ఛత్తీ్‌సగఢ్ పోలీసుల హెచ్చరికలు.. ఇటు పౌర హక్కుల నేతల ఆందోళనలు పరోక్షంగా ఔననే సమాధానం చెబుతున్నాయి. నిజానికి కేంద్ర బలగాలు ఈ ఏడాది మార్చి నుంచే తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో.. ఇక్కడి కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించారు. ఆ తర్వాత డీఆర్జీ బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగించాయి. గత నెల నేషనల్ పార్క్‌లో అతిపెద్ద ఆపరేషన్‌ను నిర్వహించి, కేంద్ర బలగాల సహకారం లేకుండానే 17 మంది మావోయిస్టులను హతమార్చాయి. అయితే.. భారత్-పాకిస్థాన్ సరిహద్దులకు వెళ్లిన బలగాలు అంతేవేగంగా ఛత్తీ్‌సగఢ్‌కు తిరిగి రావడం సాధ్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పౌరహక్కుల సంఘాల నేతలు మాత్రం 25 వేల కేంద్ర బలగాలతో నేషనల్ పార్క్‌ను చుట్టుముట్టారని ఆరోపిస్తున్నారు.
ఆపరేషన్‌ను ఆపాలి: గడ్డం లక్ష్మణ్
నేషనల్‌పార్క్ ఆపరేషన్‌ను వెంటనే ఆపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలను బలగాలు చుట్టుముట్టాయనే సమాచారం అందుతోందన్నారు. హిడ్మా, దేవాను లక్ష్యంగా చేసుకుని, అడవిని చుట్టముట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. నేషనల్ పార్క్‌ను పోలీసులు చుట్టుముట్టారని, అక్కడ గణపతి, హిడ్మా వంటి అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ మావోయిస్టులను లొంగిపోవాలని, లేదంటే చావుకు సిద్ధం కావాలని హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇప్పటికైనా కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు.
Updated Date - Jul 08 , 2025 | 11:50 AM