Polavaram project: గోదావరి-బనకచర్ల అనుసంధానం ఒప్పుకోం
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:06 AM
పోలవరం నుంచి గోదావరి-బనకచర్ల నీటి అనుసంధానాన్ని తాము అడ్డుకుంటామని తెలంగాణ నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టి, జలవిద్యుత్, గృహ అవసరాలు, పరిశ్రమలకూ నీటిని అందించనున్నట్టు వెల్లడించింది.
ప్రాజెక్టు అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం
త్వరలోనే కార్యాచరణ.. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు
గోదావరిలో నీళ్లు లేవనే ఏపీ.. ఇప్పుడు
ఏ నీటిని తరలిస్తుంది?: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టదలిచిన ‘గోదావరి-బనకచర్ల’ అనుసంధానాన్ని అడ్డుకుంటామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ‘గోదావరి-బనకచర్ల’ ప్రాజెక్టుపై రాష్ట్ర అభ్యంతరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి ఇప్పటికే వివరించామని తెలిపారు. అలాగే, సదరు ప్రాజెక్టుకు సాయం చేయరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశామని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. బసకచర్ల ప్రాజెక్టు అమలు దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తుండటంపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ను ప్రశ్నించగా... త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. సముద్రంలో కలిసే నీళ్లను తరలిస్తామని ఏపీ ఏ విధంగా అంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో గోదావరి నదిపై చేపట్టే ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను అనుమతుల కోసం సమర్పించినా.. నీటి లభ్యత లేదని వాదించే ఏపీ.. ఇప్పుడు ఏ నీటిని గోదావరి-బనకచర్ల ద్వారా తరలిస్తుందని మంత్రి విమర్శించారు.
గోదావరి-బసకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
రూ.81,900 కోట్ల అంచనా వ్యయం.. మూడు దశల్లో నిర్మాణం
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంస్వీయ ఆదాయార్జన ప్రాజెక్టు అని ఏపీ ఆర్థిక శాఖ వెల్లడించింది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇళ్లు, పరిశ్రమలకు నీటి సరఫరా మొదలైనవాటి ద్వారా ఏటా రూ2,763 కోట్లను ఆర్జించే వీలుందని చెబుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు సోమవారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఏపీ వెల్లడించింది. ఆ ప్రజెంటేషన్ తాలూకు సమాచారం ‘ఆంధ్రజ్యోతి’కి అందింది. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంలో 50 శాతం అంటే రూ.40,950 కోట్లు విదేశీ రుణంగా తీసుకోదలిచామని.. కేంద్రం 20 శాతం అంటే రూ.16,380 కోట్లు భరిస్తే.. రాష్ట్రం పది శాతం రూ.8,190 కోట్లు ఖర్చు చేస్తుందని.. మిగతా 20 శాతం వాటా అంటే రూ.16,380 కోట్లను ప్రైవేటు సంస్థల ద్వారా సమీకరిస్తామని ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్ వివరించారు. దేశంలోనే తొలిసారిగా వరద జలాలను ఎత్తిపోసే ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపడతామని తెలిపారు. ప్రాజెక్టుపై నిర్మించే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా రూ.201 కోట్లు, చెరో 200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా రూ.651 కోట్లు, గృహాలకు మంచినీటి సరఫరా ద్వారా రూ.213 కోట్లు, పరిశ్రమలకు నీటి సరఫరాతో రూ.1,699 కోట్లు.. మొత్తంగా ఏటా రూ.2,765 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. గోదావరికి వరదల సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని పేర్కొన్నారు.
దశలవారీ నిర్మాణమిలా..
పోలవరం-బనకచర్ల పథకం తొలి దశలో గోదావరి వరదనీటిని తాడిపూడి వరద కాలువ ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువను కలుపుతూ 175 కిలోమీటర్ల మేర ప్రకాశం బ్యారేజీ దాకా 5,000 క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. ఇందుకయ్యే ఖర్చు రూ.13,800 కోట్లు.
రెండో దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని బొల్లాపల్లి రిజర్వాయరు(150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు)కు తీసుకెళ్తారు. ఇందుకు రూ.35,750 కోట్లు ఖర్చవుతుంది.
మూడో దశలో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లి వద్ద 200 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం నిర్మిస్తారు. 19.5 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి సిద్దాపురం చెరువును నీటితో నింపుతారు. దానిపై రూ.582 కోట్లతో 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంటు నిర్మిస్తారు. అక్కడే 6.6 కిలోమీటర్ల మేర ఇంకో సొరంగం తవ్వుతారు. ఈ ప్రాంతంలో 200 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు తీసుకెళ్లి నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.32,350 కోట్లు వ్యయమవుతుంది.
కాగా, మొత్తంగా 80 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 91.4 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఏపీ చెబుతోంది. ఈ పథకంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని, డీపీఆర్ సమర్పిస్తే నిధుల మంజూరుపై కార్యాచరణను ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లు ఢిల్లీ వెళ్లిన ఉన్నతాధికారుల బృందం సభ్యుడొకరు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 04:08 AM