Seethakka: నేటి నుంచి అంగన్‌వాడీలూ ఒంటిపూటే!
ABN, Publish Date - Mar 15 , 2025 | 03:54 AM
రాష్ట్రంలో అంగన్‌వాడీలను ఒంటి పూటే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు అంగన్‌వాడీలను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంగన్‌వాడీలను ఒంటి పూటే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు అంగన్‌వాడీలను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం వెలువడనున్నాయి. శనివారం నుంచే రాష్ట్రంలో అంగన్‌వాడీలను ఒంటి పూట నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను ఒంటి పూట నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మే నెలలో అంగన్‌వాడీ టీచర్‌లు, హెల్పర్లకు షిప్టుల వారీగా సెలవులు ఇవ్వనున్నారు. మే 1 నుంచి 15 వరకు టీచర్లకు సెలవు ఇస్తారు. ఆ సమయంలో హెల్పర్లే అంగన్‌వాడీలను పర్యవేక్షిస్తారు. ఇక మే 16 నుంచి 31వరకు హెల్పర్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు శుక్రవారం మంత్రి సీతక్క తన భద్రతా సిబ్బంది, కార్యాలయ, నివాస సిబ్బందితో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ రంగుల పండుగ వేడుకల్లో రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి కూడా పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 03:54 AM