Deputy CM: గ్రీన్‌కో ప్రాజెక్టు అద్భుతం
ABN, Publish Date - Jun 08 , 2025 | 06:25 AM
తెలంగాణలోనూ ఇటువంటి ప్రాజెక్టే ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా పిన్నాపురంలోని గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రాజెక్టును సందర్శించారు.
తెలంగాణలోనూ ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం
పిన్నాపురం గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు సందర్శనలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్/ ఓర్వకల్లు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలోనే గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అద్భుతమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలోనూ ఇటువంటి ప్రాజెక్టే ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా పిన్నాపురంలోని గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ పవర్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు హరిత ఇంధనాని (గ్రీన్ పవర్)దేనన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల విలువైన అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నదని, పక్కా ప్రణాళికతో 2030 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి పెంపునకు గల మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. అందుకే తమ సర్కారు ‘నూతన విద్యుత్ విధానం-2025’ తెచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తు ఉత్పత్తితోపాటు దాని సరఫరాకు పుష్కలంగా విద్యుత్తు ఉండాలని భట్టి విక్రమార్క చెప్పారు. వస్తు ఉత్పత్తితోపాటు ఉపాధి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) పెరుగుతాయన్నారు. కేవలం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి వ్యయంతోపాటు కాలుష్యం పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ పవర్ ఉత్పత్తికి పెరిగిన ప్రాధాన్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి.. ముఖ్యంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి గల అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పర్యటనలో గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్, తెలంగాణ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 06:25 AM