ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Social Justice: అసంతృప్తులకు చెక్‌

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:58 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా.. అసంతృప్తులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చెక్‌ పెట్టింది. సామాజిక న్యాయం అంశాన్ని తెరపైకి తెచ్చి మంత్రి పదవుల్లో ఒకటి బీసీ, రెండు ఎస్సీలకు..

విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్ఠానం

ఒకటి బీసీ, రెండు ఎస్సీలకు కేటాయింపు.. సుదర్శన్‌రెడ్డి,

ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి నారాజ్‌

బలహీనవర్గాలకు కేటాయింపుతో బయటపడలేని స్థితి

అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ బుజ్జగింపు

మూడు పెండింగ్‌ బెర్తుల్లో ఒకటి మైనారిటీకి దక్కే చాన్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా.. అసంతృప్తులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చెక్‌ పెట్టింది. సామాజిక న్యాయం అంశాన్ని తెరపైకి తెచ్చి మంత్రి పదవుల్లో ఒకటి బీసీ, రెండు ఎస్సీలకు.. డిప్యూటీ స్పీకర్‌ పోస్టును ఎస్టీ లం బాడాకు కేటాయించడంద్వారా ఎవరూ తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరచలేని పరిస్థితిని కల్పించింది. అదే సమయంలో అసంతృప్తులకు ఆశలు కల్పిస్తూ.. మూడు బెర్తులను పెండింగ్‌లో పెట్టింది. ఆశించిన పదవి దక్కక నారాజ్‌ అయిన నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ బుజ్జగించే పనిలో పడ్డారు. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణతో ఏర్పడిన తుపాను.. టీ కప్పులో తుపానుగానే తేలిపోతుందన్న ధీమాను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనంటూ రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి పట్టుపడుతూ వస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి తనకు చోటు కల్పించాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి చోటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రేమ్‌సాగర్‌రావుకు చోటు కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక.. మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలంటూ ఆ వర్గం ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. ఓసీల్లో రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు.. మంత్రివర్గంలో చోటుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో సామాజిక న్యాయాన్ని అజెండాగా తీసుకున్న అధిష్ఠానం.. అదే అస్త్రాన్ని రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ ప్రయోగించింది.

బుజ్జగింపులు..

విస్తరణలో చోటు దక్కుతుందని గట్టి విశ్వాసంతో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి అధిష్ఠానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మల్‌రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాహుల్‌గాంధీకి లేఖ రాసి.. ఆ లేఖను విడుదల చేసేందుకు పత్రికా సమావేశం పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. విషయం తెలిసి వెంటనే రంగంలోకి దిగిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. తొలుత ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. ఇది అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమని వారికి వివరించారు. అయితే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నామని గుర్తుచేసిన వారు.. పార్టీ గెలుపు కోసం తాము ఏ విధంగా కష్టపడిందీ వివరించారు. ‘‘మంత్రివర్గంలో చోటు దగ్గరికి వచ్చేసరికి కులం అడ్డొచ్చిందా’’ అని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ గెలుపు కోసం వారు చేసిన కృషి అధిష్ఠానం దృష్టిలో ఉందని, తగిన సమయంలో తప్పకుండా న్యాయం చేస్తుందని మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ వారికి భరోసా ఇచ్చారు. అలాగే చిలుకూరు దగ్గర ఓ ఫామ్‌హౌ్‌సలో ఉన్న రాజగోపాల్‌రెడ్డిని కలిసిన మీనాక్షి నటరాజన్‌.. తగిన సమయంలో పార్టీ న్యాయం చేస్తుందని ఆయనకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆమెతోపాటుమంత్రి వివేక్‌ వెంకటస్వామి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. వివేక్‌ వెంకటస్వామికి, తనకు మంత్రి పదవి ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతిని రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేశారు. పార్టీ గెలుపుకోసం తాను ఎంతగానో కృషి చేశానని, లోక్‌సభ ఎన్నికల్లోనూ భువనగిరి సీటును గెలిపించుకొచ్చానని వివరించినట్లు సమాచారం. దీంతో.. ముగ్గురితోనే మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో మీనాక్షినటరాజన్‌ ఆయనకువివరించినట్లు తెలుస్తోంది. ఇక.. మహేశ్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మలక్‌పేట తిరుమలాహిల్స్‌లోని మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. గత ప్రభుత్వాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం ఉండేదని.. అలాంటిది ఈ ప్రభుత్వంలో అవకాశం ఇవ్వకపోవడంపై పార్టీ క్యాడర్‌కూడా కొంత అసంతృప్తిలో ఉందని.. మల్‌రెడ్డి వారికి వివరించే ప్రయత్నం చేశారు. వచ్చే స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ జిల్లాలవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మల్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీనికి మహేశ్‌గౌడ్‌.. పార్టీ తగిన సమయంలో గుర్తింపును ఇస్తుందంటూ ఆయనకు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన మల్‌రెడ్డి.. రాష్ట్రంలో సగం జనాభా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకుంటే పార్టీకి నష్టమనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

పదవులు.. సామాజిక న్యాయం!

జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం అంశాన్ని అజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. దాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ఉపక్రమించింది. తాజా విస్తరణతో రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. వీరిలో అగ్రకులాలవారు ఏడుగురు (సీఎం రేవంత్‌రెడ్డి సహా నలుగురు రెడ్లు, ఒక కమ్మ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ).. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి (వాకిటి శ్రీహరి సహా బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, అడ్లూరి లక్ష్మణకుమార్‌ సహా ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి ఇద్దరు, గడ్డం వివేక్‌ సహా ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ ఆదివాసీ నుంచి సీతక్క) ఎనిమిది మంది ఉన్నారు. తదుపరి విస్తరణలో మిగిలిన మూడు మంత్రి పదవులకుగాను ఒకటి ముస్లిం మైనారిటీలకు, ఒకటి బడుగు, బలహీన వర్గాలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. డిప్యూటీ స్పీకర్‌ పోస్టుకు ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాంచందర్‌నాయక్‌ను ఎంపిక చేయడంతో.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలవారిని ఎంపిక చేసినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పటి దాకా విప్‌లుగా పనిచేసిన అడ్లూరి లక్ష్మణకుమార్‌, రాంచందర్‌ నాయక్‌ స్థానాల్లోనూ ఆయా సామాజిక వర్గాల వారినే ఎంపిక చేసే అవకాశం ఉందనీ చెబుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:58 AM