Vemulawada Temple: ఎములాడ కోడెకు ఎంత కష్టం
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:04 AM
వేములవాడ ఆలయంలో భక్తులు మొక్కుగా సమర్పించే కోడెలు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గోశాలలో స్థలాభావం, మేత కొరత, వర్షాల ప్రభావంతో కోడెలు జబ్బుపడి చనిపోతుండటంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడెలు, 660 ఉండాల్సిన చోట 1300.. పచ్చగడ్డికీ కటకట
తాజాగా మరో 6 కోడెల మృతి.. వారంలో 26 మృత్యువాత
రంగంలోకి అధికారులు.. కోడెల గ్రేడింగ్, సరిపడా దాణా
సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు
గోశాలకు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో భూముల పరిశీలన
వేములవాడ కల్చరల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్నకు తాము ఎంతో భక్తిప్రపత్తులతో సమర్పించే కోడెలు మృత్యువాతపడుతుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం వరకు కేవలం వారం వ్యవధిలో 26 కోడెలు మృత్యువాత పడటం గమనార్హం. 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. మే 29న 8 కోడెలు, ఆ మర్నాడు 5 కోడెలు మృత్యువాతపడ్డాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే మరో ఆరు కోడెలు చనిపోయాయి. శ్రావణమాసంలో 300-400, మిగతా నెలల్లో 150-180 కోడెల దాకా భక్తులు సమర్పిస్తారు. ఆలయ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో మొత్తం 13 షెడ్లు ఉన్నాయి. అందులో రెండు షెడ్లను ఇతర పనులకు ఉపయోగిస్తుండగా, 11 షెడ్లలో 60 చొప్పున మొత్తంగా 660 కోడెలను సంరక్షించేందుకు అవకాశం ఉంది. అయితే సామర్థ్యానికి రెండింతలు... 1300 దాకా కోడెలు ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు స్వయంగా సిరిసిల్ల జిల్లా పశువైద్య శాఖ అధికారే చెప్పారు.
ఎందుకు చనిపోతున్నాయి?
గోశాల షెడ్లలో స్థలం చాలకపోవడంతో కట్టెలతో మేదరి తడకలు ఏర్పాటు చేసి వాటి కింద కోడెలను వదిలేశారు. గోశాలలో, పందిరి కింద కోడెలకు మేత కోసం వేస్తున్న రెండు ట్రాక్టర్ల పచ్చిగడ్డి (టన్ను) ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా శ్రేణీకరించకుండా అన్నింటినీ ఒకేచోట ఉంచడంతో దిట్టంగా ఉన్న కోడెల మధ్య నీరసంగా ఉన్న కోడెలు నలిగిపోతున్నాయి. ఇటీవల వరుసగా నాలుగు రోజులు కురిసిన వర్షాలకు తడిసిపోయిన కోడెలు జబ్బుపడ్డాయి. వీటిలోనే కొన్ని మృత్యువాతపడ్డాయి. గుట్టుచప్పుడుకాకుండా మూలవాగులో కళేబరాలను ఖననం చేస్తుండటంతో వాస్తవంగా ఎన్ని మృత్యువాతపడ్డాయనే లెక్కలు తెలియడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోజుకు 5 ట్రాక్టర్ల పచ్చిగడ్డి
కోడెలు వరుసగా మృత్యువాతపడుతుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. గోశాలను పరిశీలించారు. బురదమయంగా మారడంతో పూర్తిగా శుభ్రం చేయించారు. కోడెలను గ్రేడింగ్ చేసి, అనారోగ్యంగా ఉన్న కోడెలను వేరుచేశారు. దిట్టంగా ఉన్న కోడెలను, చిన్న కోడెలను వేర్వేరు షెడ్లలో ఉంచారు. కోడెల సంరక్షణకు 12మంది పశువైద్య అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కోడెల కోసం రోజూ 10టన్నుల (5 ట్రాలీల సామర్థ్యం) పచ్చి గడ్డిని అందించేలా చర్యలు తీసుకున్నారు. కాగా కలెక్టర్ చొరవతో 64 రాజన్న కోడె పిల్లలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. కాగా అనారోగ్యంతో ఉన్న కోడెలు, జెర్సీ కోడెలను భక్తులు ఆలయానికి ఇస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఇలాంటి కోడెలను సమర్పించొద్దని అధికారులు సూచిస్తున్నా, భక్తులు ఆలయం వద్ద వదిలేసి వెళుతుతుండటంతో సిబ్బందికి వాటిని సంరక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మొక్కుల ద్వారా ఏటా రూ.20 కోట్లు
వేములవాడ ఆలయానికి భక్తులు కోడెలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కోడెలు దొరక్కపోతే భక్తులు.. కోడెల ఖరీదు కింద ఎంతో కొంత మొత్తం ఆలయానికి సమర్పించి, రూ.200 చార్జీల కింద కడతారు. ఆ తర్వాత గోశాల నుంచి కోడెను తీసుకొని, ఆలయానికి సమర్పించి లాంఛనంగా మొక్కు తీర్చుకుంటారు. ఇలా శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి యేటా కోడె మొక్కుల ద్వారా రూ.22 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
గోశాల కోసం ఎన్కేపల్లిలో భూముల పరిశీలన
మొయునాబాద్ రూరల్, జూన్3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లిలోని 180వ సర్వే నంబర్‌లో గల ప్రభుత్వ భూమిని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే గోవు ల కోసం గోశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తి ప్రణాళిక, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్కేపల్లిలోని సర్వే నం.180లోని ప్రభుత్వ భూమిని సర్ఫరాజ్ అహ్మద్, నారాయణరెడ్డి పరిశీలించారు. కాగా, ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న భూముల్ని తీసుకుంటే తాము ఎలా బతకాలని కలెక్టర్ వద్ద ఎన్కేపల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. దీనిపై ప్రజలు బుధవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా వివరాలను వెల్లడించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 04:09 AM