Land Registration: స్టాంప్ డ్యూటీ తగ్గిద్దాం
ABN, Publish Date - Jun 14 , 2025 | 03:37 AM
రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీని తగ్గించి, భూ విలువలను పెంచితే ఎలా ఉంటుందన్న అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది.
భూముల విలువలు పెంచుదాం!
సర్కార్‌కు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు
త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లకు 100 నుంచి 300 శాతం దాకా పెంపు!
ఈసీ ఉచితంగా ఇవ్వడంపై యోచన
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీని తగ్గించి, భూ విలువలను పెంచితే ఎలా ఉంటుందన్న అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ 5.5శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5శాతంగా ఉన్నాయి. మొత్తంగా 7.5 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని 6 శాతానికి కుదించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా స్టాంప్ డ్యూటీ ఉండాలన్న కేంద్రం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును యధాతథంగా ఉంచి.. స్టాంప్ డ్యూటీని 4శాతానికి తగ్గిస్తే ఆర్థికంగా తలెత్తే నష్టాన్ని అంచనా వేస్తూ పూర్తి వివరాలు నివేదించినట్లు తెలిసింది. ఇదే సమయంలో భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రాంతాల వారీగా జరుగుతున్న లావాదేవీలను బట్టి.. ఎక్కడ పెంచాలి.. ఎక్కడ తగ్గించాలి.. అనే కోణంలో ప్రతిపాదనలు అందజేశారని సమాచారం.
రాష్ట్రాల వారీగా స్టాంప్ డ్యూటీ ఇలా
పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ కింద ఎంత శాతం వసూలు చేస్తున్నారనే గణాంకాలను సైతం అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఫీజు కలిపి 7.5శాతం ఉండగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్ డ్యూటీ 5శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 2 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5శాతం కలిపి మొత్తం 7.5శాతంగా ఉన్నట్లు తెలిపింది. తమిళనాడులో అత్యధికంగా ట్రాన్స్‌ఫర్ డ్యూటీ తీసుకోకుండా.. స్టాంప్ డ్యూటీ 7శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 4శాతం కలిపి 11శాతం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేరళలో స్టాంప్ డ్యూటీ 8శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2శాతం కలిపి 10శాతం, మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ 6శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1ు కలిపి 8ు వసూలు చేస్తున్నట్లు ప్రస్తావించింది. కర్ణాటకలో స్టాంప్ డ్యూటీ 5శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 0.6శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1 శాతం కలిపి 6.6శాతం వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.
విలువల పెంపుపై ప్రతిపాదనలు
రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022లో మరోసారి 33 శాతం పెంచింది. ఆ తరువాత భూముల విలువ పెంచలేదు. 2025-26లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యం రూ.19వేల కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో భూముల విలువల పెంపు తప్పదని ప్రభుత్వం సైతం భావిస్తోంది. నిజానికి ప్లాట్లు, ఫ్లాట్ల వాస్తవ విలువలకు, రిజిస్ట్రేషన్ల శాఖ పుస్తక విలువలకు చాలా చోట్ల పొంతన లేదు. దీన్ని సవరించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. భూముల విలువల పెంపునకు సంబంధించి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో ఎంత మేర పెంచాలి? అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పుడున్న విలువలను ఎంత శాతం పెంచాలి? అనే దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేసింది. అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పుడున్న విలువలను వంద నుంచి మూడొందల శాతం వరకు పెంచాలని తాజాగా సర్కార్‌కు నివేదించినట్లు సమాచారం. ప్రస్తుతం నగరాల్లో ఫ్లాట్ల చదరపు అడుగు ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం సగటున రూ.3000ఉన్న చోట వంద శాతం, చదరపు అడుగు రూ.1800 ఉన్న ప్రాంతాల్లో దాన్ని 300శాతం చొప్పున ప్రతిపాదించినట్లు తెలిసింది. కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు గజం ధర రిజిస్ర్టేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం రూ.26,700గా ఉంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం రూ.44,900గా ఉంది. అలాగే, నార్సింగ్‌లో రూ.23,800, మణికొండలో రూ.23,900, రాయిదుర్గంలో రూ.44,900, బుద్వేల్‌లో రూ.10,200చొప్పున పుస్తక విలువ ఉంది. వీటిని వంద శాతం పెంచితే ఎలా ఉంటుందనే కోణంలో ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. శేర్‌లింగంపల్లి పరిధిలో గజం ధర పుస్తక విలువ ప్రకారం రూ.26,700 ఉండగా.. రూ.50-60వేలకు పెంచాలని, మోకిలలో రూ.2,300గా ఉన్న విలువను రూ.6వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం.
ఈసీ ఉచితంగా ఇస్తే ఎలా ఉంటుంది?
ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) ద్వారా రిజిస్ర్టేషన్ శాఖకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఏటా ఈసీ చలానాల ద్వారా రూ.20 కోట్లకు మించి ఆదాయం రావడం లేదు. ఈ మొత్తాన్ని వదులుకుని.. ప్రజలకు ఉచితంగానే ఈసీ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. దీని వల్ల ప్రజల్లో సానుకూల స్పందన వస్తుందని, ప్రభుత్వానికి పెద్దగా నష్టమూ జరగబోదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల శాఖ సమర్పించిన ప్రతిపాదనలపై త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 14 , 2025 | 03:37 AM