Bandi Sanjay: బండి ఫోన్లూ ట్యాప్
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:34 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనితో ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు.
ఆయన వాంగ్మూలం కోరిన సిట్
షెడ్యూల్ చూసి చెబుతానన్న సంజయ్
రాజకీయంగా ఎదుర్కోలేక ట్యాపింగ్‌తో కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణ
బాధితులను ఎదురుగాపెట్టి ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్న సిట్
అప్పటి డీజీపీలు చెప్పినట్టే చేశానంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్
పలువురి వాంగ్మూలాలు నమోదు
హైదరాబాద్/కరీంనగర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనితో ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై శుక్రవారం రాత్రి బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తామని, వాటికి సమాధానం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. నోటీసులు అందిన తర్వాత తన షెడ్యూల్ చూసుకుని సమయం చెబుతానని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ బృందం తమ తప్పులు బయటపడకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. అవసరం తీరగానే ట్యాపింగ్ సాక్ష్యాలను నాశనం చేసుకుంటూ వచ్చిందని సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు కీలకపాత్ర వహించినట్టు తేల్చారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన డేటా కూడా పోయిందని సిట్ అధికారులు భావిస్తున్నారు. సుమారు 42 హర్డ్ డిస్క్‌ల్లోని డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు సఫలమైనా.. పాత కంప్యూటర్లు, మిగిలిన హర్డ్‌డి్‌స్కల ముక్కల నుంచి 2023 నవంబర్ నెలలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వివరాలను అధికారులు రిట్రీవ్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సుమారు 650 ఫోన్ నంబర్లకు సంబంధించి 15 రోజుల డేటా లభించిందని.. దాని ఆధారంగా ఆ ఫోన్ నంబర్లను వినియోగిస్తున్న వారిని సిట్ అధికారులు పిలిచి, సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. సిట్‌కు దొరికిన డేటాలో సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులు, కుటుంబ సభ్యులతోపాటు పొంగులేటి సహా కొందరు రాష్ట్ర మంత్రుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన క్రమంలో.. అప్పటి ట్యాపింగ్ డేటా విచారణాధికారులకు అందుబాటులోకి రాలేదని, ధ్వంసమై ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభాకర్‌రావు బృందం తాము ట్యాప్ చేస్తున్న ప్రముఖులకు కోడ్ నేమ్స్ పెట్టిందని, ఆ కోడ్‌తోనే ట్యాపింగ్ డేటాను నిల్వ చేసేదని గుర్తించినట్టు తెలిసింది.
నాటి డీజీపీలే చేయించారు..!
సిట్ అధికారులు శుక్రవారం కూడా ప్రభాకర్‌రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఒకరిద్దరు సాక్షులను ఆయన ఎదురుగా కూర్చోపెట్టి ‘వారి ఫోన్లు మావోయిస్టులవి ఎందుకు అవుతాయి? ఎందుకు ట్యాపింగ్ చేయించారు?’ అని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఎంత అడిగినా తనకేమీ గుర్తులేదని, కింది సిబ్బంది పంపిన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ అనుమతి కోసం రివ్యూ కమిటీకి పంపానని ప్రభాకర్‌రావు చెప్పినట్టు తెలిసింది. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ వారి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారని అధికారులు ప్రశ్నించగా... నాటి డీజీపీలు మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌కుమార్‌లకు అంతా తెలుసని, తాను కేవలం తన డ్యూటీ మాత్రమే చేశానని పేర్కొన్నట్టు సమాచారం. అక్రమ ట్యాపింగ్ మీ డ్యూటీ కాదు కదా అని అధికారులు ప్రశ్నిస్తే.. మౌనం వహిస్తున్నట్టు తెలిసింది. కాగా, ప్రభాకర్‌రావును ప్రకటిత నేరస్తుడిగా పేర్కొనాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు హాజరుకావడంతో.. సిట్ అభ్యర్ధనను తిరస్కరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలే సాక్ష్యం: గోనె ప్రకాశరావు
శుక్రవారం మరికొందరు ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశరావు, గిరిజన వర్సిటీ వైస్ చాన్సలర్ వైఎల్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత కపిల్ తదితరులు సిట్ ఎదుట హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు ఆయన అనుచరుడు ప్రవీణ్‌రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులకు తాజాగా సిట్ నుంచి పిలుపు వచ్చింది. కాగా, తన ఫోన్‌ను ట్యాప్ చేసిన ప్రభాకర్‌రావు ఆ సమాచారాన్ని సంతో్‌షరావు ద్వారా కేసీఆర్‌కు పంపించారని గోనె ప్రకాశరావు ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ బయటపెట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలే అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పెద్ద ఆధారమని చెప్పారు.
నేను అప్పుడే చెప్పా...: బండి సంజయ్
కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తనతోపాటు కుటుంబ సభ్యులు, అనుచరులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. వాంగ్మూలం నమోదు కోసం సిట్ తనకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేశాను. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు గత ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి నా నివాసంపై దాడి చేసి పదో తరగతి పేపర్ లీక్ పేరుతో అరెస్టు చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవో సవరణపై దీక్ష జరగకుండా నిలువరించేందుకు ప్రయత్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత సమాచారం తెలుసుకుని దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. గతంలోనే ఈ విషయం చెప్పాను..’’ అని సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 03:34 AM