SC Categorization: అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు
ABN, Publish Date - Mar 17 , 2025 | 03:24 AM
ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్పీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మరో రెండు బిల్లులు కూడా..
నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
వర్గీకరణపై నేడే చర్చించి, ఆమోదించే చాన్స్
బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు?
బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్పీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి.. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై సోమవారమే చర్చించి, ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15 శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. గ్రూప్-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి, వారికి 1 శాతం.. గ్రూప్-2లో మధ్యస్థంగా లబ్ధిపొందిన షెడ్యూల్ కులాలను చేర్చి, వారికి 9 శాతం, గ్రూప్-3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్లను కేటాయించి, నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. తద్వారా ఆయా వర్గాలన్నింటికీ మేలు జరుగుతుందని సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు తరువాత దానిని అమలుచేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశాలతో పాటు మరికొన్నింటిపైనా చర్చించనున్నారు.
అలాగే.. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులనూ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చ జరపనుంది. వాటిని ఆమోదించి పార్లమెంటుకు పంపాలని.. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో, విద్య ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై పకడ్బందీగా ముందుకెళ్లే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. కాగా.. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బీసీ బిల్లుల్లో రిజర్వేషన్లను కేటగిరీలవారీగా కాకుండా గంపగుత్తగా పెంచనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల్లోని ఏ కేటగిరీకి 7ు, బి కేటగిరీకి 10ు, సి కి 1ు, డి 7ు, ఈ కేటగిరీకి 4ు చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. బీసీ బిల్లులపై చర్చించేందుకు కాంగ్రె్‌సలోని బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీలో, సభ ప్రారంభం కావడానికి ముందే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టడం, సమగ్ర కుల సర్వే, రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవడం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. ఇక.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన సవరణ బిల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నారు.
Updated Date - Mar 17 , 2025 | 03:26 AM