Illegal Immigrants: నలుగురు రోహింగ్యాల అరెస్టు
ABN, Publish Date - May 21 , 2025 | 06:48 AM
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీలతో పాటు పలు గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, హయాత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన మహ్మద్ అర్మాన్ అలియాస్ సయ్యద్-ఉల్-ఆమిన్(32), అతని భార్య మహమ్మద్ రుమానా అక్తర్ అలియాస్ ముస్తఖున్నీసా(26) 2011లో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఇక్కడి హఫీజ్‌బాబానగర్‌లోని జామియా సరియా మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ హారిస్ అలియాస్ మహమ్మద్ రిజ్వాన్(మయన్మార్‌కు చెందినవాడు), రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లికి చెందిన మదర్సా టీచర్ అయాజ్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. మదర్సా టీచర్లిద్దరూ అర్మాన్‌కు నకిలీ ధ్రువపత్రాలను సమకూర్చారు. వాటి ఆధారంగా మంచాలలోని మీసేవ కేంద్రం ద్వారా అర్మాన్ తొలుత ఆధార్ కార్డును తీసుకున్నాడు. నకిలీ నిఖా సర్టిఫికెట్‌తో రుమానాకు కూడా ఆధార్ ఇప్పించాడు. అర్మాన్ సోదరుడు మహమ్మద్ నయీం అలియాస్ హైరుల్ ఆమిన్(20) కూడా 2016లో మయన్మార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతనికి బాలాపూర్‌లో ఉండే షోయబ్‌మాలిక్ అనే మయన్మార్ జాతీయుడు నకిలీ పత్రాలు సమకూర్చి, ఆధార్‌కార్డు ఇప్పించాడు. అర్మాన్ కుటుంబం ఆధార్ సాయంతో పాన్‌కార్డులు, ఓటర్ ఐడీలు, డ్రైవింగ్‌లైసెన్సులు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీరి వ్యవహారంపై ఉప్పందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అర్మాన్, రుమానా, నయీం, మదర్సా టీచర్ హారి్‌సలను అరెస్టు చేశారు. వీరి నుంచి 5 ఆధార్‌కార్డులు, 2 పాన్‌కార్డులు, 5 ఓటర్ ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్, 2ఎల్‌ఐసీ పాలసీలు, 3 ఏటీఎం కార్డులు, గ్యాస్ బుక్, 4 బ్యాంకు పాస్ పుస్తకాలు, నాలుగు జనన ధ్రువీకరణ పత్రాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయాజ్, షోయబ్‌మాలిక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - May 21 , 2025 | 06:49 AM