Rahul Gandhi: బీజేపీ మహా రిగ్గింగ్
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:49 AM
మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాలనే బిహార్ శాసనసభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయనుందని, ఎక్కడైతే తమకు పరాజయం తప్పదనుకుంటుందో ఆ రాష్ట్రాలన్నింటిలోనూ అమలు చేయనున్నందంటూ బీజేపీపై ధ్వజమెత్తారు.
మహారాష్ట్రలో విజయం కోసం మ్యాచ్ ఫిక్సింగ్
ఐదు పద్ధతుల్లో పక్కాగా అక్రమాలు
సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీం సీజే తొలగింపూ ఇందులో భాగమే
రేపు బిహార్‌లోనూ జరిగేది ఇదే
రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూన్ 7: మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని కాంగ్రెస్ నేత రాహల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలు ప్రజాస్వామ్య రిగ్గింగ్‌కు బ్లూప్రింట్ వంటివని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాలనే బిహార్ శాసనసభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయనుందని, ఎక్కడైతే తమకు పరాజయం తప్పదనుకుంటుందో ఆ రాష్ట్రాలన్నింటిలోనూ అమలు చేయనున్నందంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులతోపాటు ఈసీ వర్గాలు కూడా ఖండించింది. ఆయనవి నిరాధార వ్యాఖ్యలని తేల్చాయి. దీంతో ఈసీపైనా రాహుల్ విరుచుకుపడ్డారు. ‘‘సాకులు కాదు.. మీరు పలికే సత్యమే మీ విశ్వసనీయతను నిలుపుతుంది’’ అని కాంగ్రెస్ నేత ఘాటుగా సూచించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లలో బీజేపీ 132, దాని మిత్రపక్షాలు మరో 103 చోట్ల గెలిచి, ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే, అక్కడ విజయం కోసం బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియను మృగ్యం చేసిందని తాజాగా రాసిన ఓ వ్యాసంలో రాహుల్ విమర్శించారు. ఎన్నికల కమిషనర్ నియామకం కోసం ప్యానెల్ రిగ్గింగ్‌కు పాల్పడటం, నకిలీ ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని పెంచేయడం, గెలవాలనుకున్న చోట బోగస్ ఓటింగ్ జరపించడం, ఆధారాలను దాచిపెట్టడం.. అనే ఐదు పద్ధతులను ఈ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిందన్నారు. ఇదేదో చిన్నాచితక మోసం కాదని, వ్యవస్థలను గుప్పెట్లో ఉంచుకుని రిగ్గింగ్‌కు భారీఎత్తున వొడిగట్టారన్నారు. భారత ఎన్నికల ప్రధానాధికారిని ఎంపికచేసే కమిటీనుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, ఆ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పిస్తూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు(2023) తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థ మొగ్గేందుకు ఈ చర్య దోహదం చేసిందని రాహుల్ విమర్శించారు. మోసంచేసి ఆట గెలవవచ్చుగానీ, దానివల్ల ప్రజా విశ్వాసానికి విఘాతం కలుగుతుందని, వ్యవస్థలు దెబ్బతింటాయన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మహారాష్ట్ర ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. వ్యవస్థలను ఘోరంగా అవమానించే పనిని తిరిగి రాహుల్ మొదలుపెట్టారని మండిపడ్డారు. వ్యవస్థలపై ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఆక్షేపించారు. మహారాష్ట్ర ఎన్నికల విషయమై ఈసీ ఇప్పటికే అనేకసార్లు వివరణ ఇచ్చిందని బీజేపీ నేత తుహిన్ సిన్హా అన్నారు. తప్పుడు కథనాలకు బ్లూప్రింట్ రాహుల్ వ్యాసం అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.
ఈసీ వర్సెస్ రాహుల్
రాహుల్ వ్యాఖ్యలను ఈసీ వర్గాలు తప్పుబట్టి, డాక్యుమెంట్లను విడుదల చేశాయి. ఆయనవి నిరాధార వ్యాఖ్యలని తేల్చాయి. దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను వేసిన ప్రశ్నలకు సూటిగా స్పందించకుండా సంతకం లేని పత్రాలు విడుదల చేయడం ఒక రాజ్యాంగ సంస్థగా మీకు తగదు. దాచటానికి ఏమీ లేదు అనుకుంటే నా వ్యాసంలో విసిరిన ప్రశ్నలకు బదులివ్వండి. సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన... డిజిటల్, మిషన్ రీడింగ్ ఓటర్ రోల్స్‌ను బయటపెట్టింది. సాయంత్రం 5 తర్వాత మహారాష్ట్రలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసిన సీసీ కెమెరా పుటేజీని విడుదల చేయండి.’’ అని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 06:00 AM