Prabhakar Rao: హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్‌రావు
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:11 AM
కేసు నమోదవ్వగానే.. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే..! కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారణ
ప్రభాకర్‌రావుకు శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారి స్వాగతం
సీరియ్‌సగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదవ్వగానే.. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే..! కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరించి, వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్‌పోర్టు పునరుద్ధరణ జరిగిన మూడ్రోజుల్లో ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరవ్వాలని సూచించింది. దాంతో.. అమెరికాలోని రాయబార కార్యాలయం వన్‌టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టును ప్రభాకర్‌రావుకు అందజేసింది. శనివారం నుంచి అమెరికా నుంచి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణమైన ప్రభాకర్‌రావు.. దుబాయ్‌కి, అక్కడి నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవ్వడానికి దాదాపు మూడున్నార గంటల సమయం పట్టినట్లు తెలిసింది. ఆ వెంటనే సిట్ అధికారులు ప్రభాకర్‌రావును బయటకు తీసుకువచ్చారు. సిట్ కార్యాలయాన్ని రెండు వారాల క్రితం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి మార్చారు. అయితే.. ప్రభాకర్‌రావు విచారణ నేపథ్యంలో జూబీహిల్స్ ఠాణాలోని రెండో అంతస్తులో విచారణకు ఏర్పాట్లు చేశారు.
సిట్ కార్యాలయం వద్ద మీడియా హడావుడి ఉండే అవకాశాలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దర్యాప్తు అధికారులు విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరవ్వనున్నట్లు తెలిసింది. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు-- టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు విచారణలో ‘‘ప్రభాకర్‌రావు చెబితేనే చేశాం’’ అంటూ వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు వాంగ్మూలం కీలకంగా మారింది. ‘‘ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా జరిగిందా? ఎవరెవరి అనుమతులతో ట్యాపింగ్ చేశారు? ఒకవేళ అనధికారికమైతే.. ఎవరి ఆదేశాలను పాటించారు?’’ అనే కోణంలోనే విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాకర్‌రావు శంషాబాద్ విమానాశ్రయానికి రాగానే.. ఓ కస్టమ్స్ అధికారి స్వాగతం పలికారు. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగానికి ఫిర్యాదు చేసేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. ఓ నిందితుడికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధమని నగర పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 04:13 AM