Saidapur Police:మా ముందే ఫోన్ మాట్లాడతావా
ABN, Publish Date - Jun 11 , 2025 | 07:35 AM
మా ముందే ఫోన్ మాట్లాడతావా..? అంటూ ముగ్గురు పోలీసులు ఓ ద్విచక్రవాహనదారుడిపై రెచ్చిపోయారు. ఫోన్ మాట్లాడితే తప్పేంటి ? అని ఎదురు ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిని చావబాదారు.
వాహన తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనదారుడిపై పోలీసుల దౌర్జన్యం
సీపీ, ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి బాధితుడి ఫిర్యాదు
కరీంనగర్ జిల్లాలో గత నెల 8న ఘటన
సైదాపూర్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మా ముందే ఫోన్ మాట్లాడతావా..? అంటూ ముగ్గురు పోలీసులు ఓ ద్విచక్రవాహనదారుడిపై రెచ్చిపోయారు. ఫోన్ మాట్లాడితే తప్పేంటి ? అని ఎదురు ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిని చావబాదారు. అంతేనా.. విధి నిర్వహణకు ఆటంకం కలిగించాడంటూ అతనిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో గతనెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా.. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు.. పోలీసులను, ఎస్సీ కమిషన్‌ను, మానవ హక్కు ల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకా్‌షరెడ్డి, అజయ్‌పై పోలీసులు సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సైదాపూర్ మడలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ శీతల పానీయాల ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. మహేందర్ మే 8వ తేదీన శంకరపట్నం మండలం మొలంగూర్ వైపు నుంచి సైదాపూర్‌కు తన ద్విచక్రవాహనంపై వస్తుండగా వాహ న తనిఖీల్లో భాగంగా లస్మన్నపల్లి శివారులో పోలీసులు ఆపారు. విధుల్లో ఉన్న సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, అజయ్.. మహేందర్‌కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేసి వాహన రికార్డులు తనిఖీ చేశారు. ఈ సమయంలో ఫోన్ కాల్ రావడం తో మహేందర్ పక్కకి వెళ్లి మాట్లాడాడు. అయితే, పోలీసుల ముందే ఫోన్ మాట్లాడతా ? అంటూ మహేందర్ తీరుపై ట్రైనీ ఎస్సై భార్గవ్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఫోన్ మాట్లాడితే తప్పేంటి? అని మహేందర్ ఎదురు ప్రశ్నించగా ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, అజయ్ కలిసి మహేందర్‌ను చితక బాదారు. అనంతరం మహేందర్ ఫోన్ లాక్కొని విడిచిపెట్టారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బకు మహేందర్ కర్ణభేరి పగిలి చెవి నుంచి రక్తస్రావమైంది. అనంతరం మహేందర్ తన ఫోన్ కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు క్షమాపణ పత్రం రాయించుకుని ఫోన్ ఇచ్చారు. మహేందర్‌పై డ్రంకెన్ డ్రైవ్, విధులకు అటంకం కలిగించాడని కేసులు నమోదు చేశారు. అయితే, తాను దళితుడిని అని చెప్పినా వినకుండా కులం పేరుతో దూషిస్తూ తనపై దాడి చేసిన ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహేందర్ సైదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే, తనపై జరిగిన దౌర్జన్యంపై సీపీ, ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘానికీ ఫిర్యాదు చేశాడు. దళిత సంఘాలు మ హేందర్‌కు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఈ ఘటనపై విచారణ జరిపిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం.. ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల దాడికి సంబంధించిన వీడి యో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో మహేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం పీఎస్ వద్ద ఆందోళన చేపట్టగా.. ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Updated Date - Jun 11 , 2025 | 07:43 AM