Maoists: ఏవోబీలో ఎదురు కాల్పులు..
ABN, Publish Date - May 30 , 2025 | 05:13 AM
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్ హిద్మాను అరెస్టు చేశారు.
మావోయిస్టు కీలక నేత జూనియర్ హిద్మా అరెస్టు
సీలేరు (అల్లూరి జిల్లా), మే 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్ హిద్మాను అరెస్టు చేశారు. పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒడిశాలోని కోరాపుట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏవోబీలోని కోరాపుట్ జిల్లా బోయిపర్‌గూడా పోలీ్‌సస్టేషన్ పరిధిలోని పేటగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఏఎస్పీ పార్థకశ్యప్ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కొండపై క్యాంప్ నిర్వహిస్తున్న మావోయిస్టులు కనిపించారు.
దీంతో పోలీసులు ఆ కొండను చుట్టుముట్టారు. ఇది గమనించిన మావోయిస్టులు కొండ పైనుంచి పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పోలీసులు గాలిస్తుండగా.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు కుంజమ్ హిద్మా అలియాస్ జూనియర్ హిద్మా అలియాస్ మోహన్‌గా గుర్తించారు. హిద్మా నుంచి ఏకే47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 ఎలక్ర్టిక్, నాన్ ఎలక్ర్టిక్ డిటొనేటర్లు, రేడియో, కత్తులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు పరారయ్యాడు.
Updated Date - May 30 , 2025 | 05:13 AM