ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping: ట్యాపింగ్‌ డేటా ఎవరికి ఇచ్చారు?

ABN, Publish Date - Jun 22 , 2025 | 03:49 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శనివారం మరోసారి విచారించింది.

అంత తక్కువ సమయంలో 600కుపైగా ఫోన్లను ఎలా ట్యాప్‌ చేయగలిగారు?

  • ప్రణీత్‌రావుకు సిట్‌ ప్రశ్నలు.. 5 గంటలు విచారణ

  • ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ఆస్కారమున్న అంశాలపై ఆరా

  • మరో 15 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు

హైదరాబాద్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శనివారం మరోసారి విచారించింది. అప్పట్లో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని ప్రణీత్‌రావు గత విచారణలో అధికారులకు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగానే సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును కీలక అంశాలపై ప్రశ్నించారు. అందులో ప్రభాకర్‌రావు చెప్పిన అంశాల ఆధారంగా మళ్లీ ప్రణీత్‌రావును సిట్‌ బృందం ప్రశ్నించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు అధికారులు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి సమాధానాలు తీసుకున్నారు. ముఖ్యంగా దర్యాప్తులో కీలకమైన, ప్రభాకర్‌రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ఆస్కారమున్న అంశాలపై వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. ‘అంత తక్కువ సమయంలో 600కుపైగా ఫోన్లు ఎలా ట్యాప్‌ చేయగలిగారు? ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్‌ నంబర్లను సైతం మావోయిస్టు సానుభూతిపరులుగా ఎందుకు చూపించారు? ట్యాపింగ్‌ ద్వారా వచ్చిన సమాచారమంతా ఎవరెవరికి, ఏయే పద్ధతుల్లో అందజేశారు?’ అనే అంశాలపై లోతుగా ప్రశ్నించారు. ఇక ఆర్థికపరమైన వివరాలనూ అధికారులు రాబట్టినట్టు తెలిసింది. మొత్తంగా 5వ సారి విచారణకు హాజరైన ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు సుమారు 15 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల నుంచి అధికారులు శనివారం వాంగ్మూలాలు తీసుకున్నారు. వారి ఫోన్లు ట్యాప్‌ అయినప్పుడు ఎక్కడున్నారు? ఏం చేశారు? ఫోన్‌ ట్యాప్‌ అయినట్టు సందేహం వచ్చిందా? మీరు ఫోన్‌లో మాట్లాడిన అంశాల్ని వేరే ఎవరైనా గుర్తించినట్టు తెలిసిందా? ఆర్థికంగా, ఇతరత్రా ఏదైనా నష్టం జరిగిందా? అనే వివరాలను సేకరించారు.

రేపు సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం, ఇతర వివరాల ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రివ్యూ కమిటీ ఆమోదం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేసినట్టు ప్రభాకర్‌రావు గత విచారణల చెప్పడంతో.. సిట్‌ అధికారులు నాటి రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని ప్రభాకర్‌రావు ముందుపెట్టి.. పూర్తి వివరాలు బయటపెట్టించేందుకు ప్రయత్నించనున్నారు.

వచ్చే వారం ప్రముఖుల వాంగ్మూలం నమోదు!

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రస్తుత, మాజీ పోలీసు అధికారులు, ఇతర ప్రముఖుల నుంచి వాంగ్మూలాలు సేకరించేందుకు సిట్‌ సిద్ధమైంది. వచ్చే వారం విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్‌ ట్యాప్‌ అయిన షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్‌ కాంగ్రెస్‌ నేత జమృద్‌ఖాన్‌, 10 వార్డు మాజీ కౌన్సెలర్‌ శ్రావణి, కాంగ్రెస్‌ పార్టీ కొందుర్గు మండల శాఖ అధ్యక్షుడు ఏ.కృష్ణారెడ్డిలకు వాంగ్మూలం కోసం సిట్‌ నుంచి పిలుపువచ్చింది. మొత్తంగా సిట్‌ ఇప్పటివరకు దాదాపు 400 మంది ట్యాపింగ్‌ బాధితుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్టు సమాచారం.

Updated Date - Jun 22 , 2025 | 03:49 AM