Operation Kagar: నక్సలిజానికి మరణమే ముగింపు కాదు..
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:21 AM
‘ఆపరేషన్ కగార్’ తర్వాత కుదేలైపోయింది. కొవిడ్ కల్లోలంతో అడవుల్లో అన్నలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి, హరిభూషణ్ లాంటి అగ్రనేతలను కోల్పోగా..
లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవొచ్చు
చివరి అవకాశమంటూ పోలీసుల ప్రచారం
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘నక్సలిజానికి ముగింపు మావోయిస్టుల మరణం కాదు. లొంగిపోతే జనజీవన స్రవంతిలో కలవొచ్చు’’ అంటూ భద్రత బలగాలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వేలల్లో ఉండే మావోయిస్టు క్యాడర్.. ‘ఆపరేషన్ కగార్’ తర్వాత కుదేలైపోయింది. కొవిడ్ కల్లోలంతో అడవుల్లో అన్నలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి, హరిభూషణ్ లాంటి అగ్రనేతలను కోల్పోగా.. గత ఏడాది నుంచి ఆకురాలే కాలాల్లో భద్రత బలగాలు వ్యూహాత్మకంగా జరిపిన దాడుల్లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. చలపతి, సుధాకర్, భాస్కర్‌లాంటి పెద్ద నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఉద్యమంలో నేలకొరిగారు. ఇప్పుడు హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ సాగుతోంది. దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతుండగా.. బలగాలు పదుల సంఖ్యలో కొత్త క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. అబూజ్‌మఢ్‌లోకి కూడా చొచ్చుకుపోతున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా..
క్షేత్రస్థాయిలో బలగాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టులు హింసను వీడి లొంగుబాట్లపై దృష్టిసారించాలని అటు ఛత్తీ్‌సగఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ సరిహద్దు జిల్లాల ఎస్పీలు ప్రకటనలు చేస్తున్నారు. ‘‘మావోయిస్టులు కాల్పులను విరమించాలని కోరుతున్నారు. ప్రజా సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలం కాల్పులను విరమించి, నిర్దిష్ట గడువును ప్రకటించి, లొంగిపోయేందుకు మావోయిస్టులకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని ఓ అధికారి వివరించారు. అగ్రనాయకులు అడవుల్లోనే చావోరేవో తేల్చుకుంటున్నారని, లొంగిపోతున్న వారిలో కింది స్థాయి క్యాడర్ ఎక్కువగా ఉంటోందని వివరించారు. తాజా ప్రతిపాదనపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న అగ్రనాయకత్వం స్వచ్ఛందంగా లొంగిపోయే అవకాశాలున్నట్లు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ‘‘ఛత్తీ్‌సగఢ్-ఒడిసా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చలపతి చనిపోయారు. వృద్ధాప్యం కారణంగా ఆయన రెండు కర్రల సాయంతో నడిచేవారు. చనిపోయిన సమయంలోనూ ఆయన రెండు వైపులా రెండు కర్రలు పడి ఉన్నాయి. ఇలాంటి వారికి లొంగిపోయే అవకాశం కల్పించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే.. మావోయిస్టులు లొంగుబాట పడతారా? లేదా.. చావోరేవో రణరంగంలోనే తేల్చుకుంటారా? అనేదానిపై స్పష్టత లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 04:21 AM