Harassment: ఇదెక్కడి న్యాయం!
ABN, Publish Date - Jun 27 , 2025 | 05:02 AM
ఇదెక్కడి న్యాయం..! నిందితులకు పోలీసు ఉన్నతాధికారి కొమ్ముకాస్తారా? ఎన్నారై భర్త వేధింపులకు గురిచేసి, అన్యాయం చేస్తే.. ఇల్లెందు పోలీసులను న్యాయం చేయాలని కోరాం.
నిందితులకు పోలీసు అధికారి కొమ్ముకాస్తారా?
న్యాయం కోసం సీఎం, డీజీపీని కలుస్తాం
ఎన్నారై నవీన్‌రెడ్డి భార్య శ్రావ్య
ఇల్లెందు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇదెక్కడి న్యాయం..! నిందితులకు పోలీసు ఉన్నతాధికారి కొమ్ముకాస్తారా? ఎన్నారై భర్త వేధింపులకు గురిచేసి, అన్యాయం చేస్తే.. ఇల్లెందు పోలీసులను న్యాయం చేయాలని కోరాం. పోలీసు ఉన్నతాధికారి మాత్రం నిందితులకే కొమ్ముకాస్తున్నారు. ఏకంగా.. కౌన్సెలింగ్ నిర్వహించి, విచారణ జరుపుతున్న సీఐని సస్పెండ్ చేయడం ఏమిటి?’’ అని ఎన్నారై పెండ్లి నవీన్‌రెడ్డి భార్య.. దుబ్బాక శ్రావ్య నిలదీశారు. పోలీసు కౌన్సెలింగ్‌కు రాకుండా తప్పించుకుంటున్న తన భర్తను అమెరికా నుంచి రప్పించి, తనకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ తమను వేధించారంటూ నవీన్‌రెడ్డి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో.. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సీఐని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే..! ఈ నేపథ్యంలో శ్రావ్య ఇల్లెందు ఠాణా ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘‘నన్ను వీసా స్టాంపింగ్ పేరుతో భారత్‌కు పంపిన నవీన్‌రెడ్డి.. ఆ తర్వాత కాపురానికి తీసుకెళ్లడం లేదు. నాకు సంతానం కలగడం లేదని, నాలో లోపం ఉందంటూ తోటికోడలు, ఆమె భర్త హరీశ్‌రెడ్డి నన్ను ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లకు తీసుకెళ్లి, వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు నాలో ఎలాంటి లోపం లేదని, నా భర్తకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అయితే.. అత్తింటివారు నాపైనే నిందలు వేస్తూ.. మానసిక క్షోభకు గురిచేశారు’’ అని శ్రావ్య వివరించారు. తన కొడుకు ఇండియాకు రాడని, అతనిలో ఏలోపం లేదని తన మామ ఉపేందర్‌రెడ్డి తేల్చిచెప్పారని, తమకు ఐజీ అండగా ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రావ్య తండ్రి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 రోజులుగా న్యాయం కోసం తిరుగుతున్న తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, నవీన్‌రెడ్డి విషయంలో మాత్రం ఐజీ వెంటనే స్పందించారని ఆరోపించారు. తన కూతురికి న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీని కలుస్తానని వివరించారు.
Updated Date - Jun 27 , 2025 | 05:02 AM