Medical Colleges: బోధనాస్పత్రుల్లో నకిలీ రోగుల వివరాలిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:09 AM
బోధనాస్పత్రులు నమోదు చేసే రోగుల వివరాలు నకిలీవని తేలితే కఠిన చర్యలు తప్పవని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది.
‘అభా’ ఐడీ నమోదు చేయాల్సిందే
లేకుంటే సీట్ల పెంపు ఉండబోదు : ఎన్‌ఎంసీ
హైదరాబాద్, ఆగసు 2 (ఆంధ్రజ్యోతి): బోధనాస్పత్రులు నమోదు చేసే రోగుల వివరాలు నకిలీవని తేలితే కఠిన చర్యలు తప్పవని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) ఐడీని నమోదు చేయాలని గతం లోనే ఆదేశించింది. అయితే అభా ఐడీ నమోదును అన్ని వైద్య కళాశాలలు చేయడం లేదని ఎన్‌ఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలకు తాజాగా లేఖలు రాసింది. అలాగే అన్ని ప్రైవేటు హెల్త్ యూనివర్సిటీలు, ప్రైవేటు వైద్య కళాశాలలకు ఆ లేఖను పంపింది.
తక్షణమే తమ ఆదేశాలను పాటించాలని కోరింది. దాని ప్రకారం.. అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులు రోగుల రికార్డులను నిర్వహించాలి. ఇన్‌పేషెంట్ రోగుల వివరాలను యూనిట్ ఫ్యాకల్టీ వద్ద నమోదు చేయాలి. ఆ బాధ్యత సీనియర్ రెసిడెంట్ వైద్యుడు తన పేరుతో సంత కం చేసి మరీ ఇన్‌పేషెంట్ రోగుల వివరాలను రికార్డు చేయాలి. ఇక రోగులకు చేసిన రక్త, మూత్ర ఇతర పరీక్షల నివేదికలపై సంబంధిత విభాగాపు వైద్యుడు విధిగా సంతకం చేయాలి. బోధనాస్పత్రులన్నీ ఓపీ, ఐపీ రోగుల రిజిస్ట్రేషన్‌తో పాటు అభా ఐడీని రిజిష్టర్ చేయించుకోవాలని పేర్కొంది. అభా ఐడీ ఉన్న కళాశాలలకే భవిష్యత్‌లో సీట్లు పెంపు, కొత్త పీజీ కోర్సుల ఏర్పాటుకు అనుమతినిస్తామని స్పష్టం చేసింది. అలాగే అభా ఐడీ లేదని ఏ రోగికి చికిత్స నిరాకరించవద్దని సూచించింది.
Updated Date - Aug 03 , 2025 | 04:09 AM