Kannappa Movie: కన్నప్ప లో బ్రాహ్మణులను కించపరిచారు
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:22 AM
ఇందుకు నిరసనగా శనివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ‘శివయ్యకు అపచారం-తిన్నడుకు అన్యాయం’ పేరుతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ఏకరుద్రాభిషేకాలు చేశారు.
గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక నిరసన
గుంటూరు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ సంప్రదాయాన్ని అవమానించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్ర్తి మండిపడ్డారు. ఇందుకు నిరసనగా శనివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ‘శివయ్యకు అపచారం-తిన్నడుకు అన్యాయం’ పేరుతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ఏకరుద్రాభిషేకాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కన్నప్ప సినిమాలో హాస్య పాత్రల కోసం, బ్రాహ్మణులను, పిలకను వాడుకోవడం క్షమించరానిదన్నారు. ఈ పాత్రల విషయమై గత నవంబర్లో ఏపీ హైకోర్టులో తాము రిట్ పిటిషన్ దాఖలు చేశామని, కేసు పెండింగ్‌లో ఉండగా కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు రీజనల్ అధికారి ఈ సినిమాపై చర్యలు తీసుకోకపోతే భారతీయ చలనచిత్ర చట్టం ప్రకారం ఆ అధికారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామని శ్రీధర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 05:22 AM