KTR: నిందలు.. దందాలు.. చందాలు
ABN, Publish Date - Jun 08 , 2025 | 06:39 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కంటే ముందు కేటీఆర్ మాట్లాడారు. అంతేకాక తన ‘ఎక్స్’ వేదిక పోస్టుల ద్వారా ఖండించారు.
ఇదే కాంగ్రెస్ పాలన
బీజేపీతో కుమ్మక్కై కాళేశ్వరంపై దుష్ప్రచారం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ కంటే ముందు కేటీఆర్ మాట్లాడారు. అంతేకాక తన ‘ఎక్స్’ వేదిక పోస్టుల ద్వారా ఖండించారు. కాంగ్రె్‌స-బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే హరీశ్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్ పాలనను ‘బీఆర్‌ఎ్‌సపై నిందలు.. కాంట్రాక్టర్లతో దందాలు.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు..’ అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా.. ముఖ్యమంత్రి, మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘గుజరాత్‌లో మోర్బి బ్రిడ్జి కూలి 140 మంది చనిపోయినా ఎన్డీఎ్‌సఏ నోరు మెదపలేదు.. బిహార్‌లో నాలుగు రోజులకే బ్రిడ్జి కూలినా ఏ ఏజెన్సీ స్పందించలేదు.. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలినా రాదు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది చనిపోయినా ఎన్‌డీఎ్‌సఏ విచారణ చేయలేదు.. కాళేశ్వరం పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మతులు చేయకుండా రాద్దాంతం చేస్తున్నారు.’ అని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ నూతన భవనం కట్టిన ఎల్ అండ్ టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజీ కట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయ భవనం కట్టింది కూడా అదే సంస్థ అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర రైతులను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో జిల్లాలకు వెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా.. కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 06:39 AM