Kodandaram: బనకచర్లపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:51 AM
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు అర్హత బీఆర్‌ఎ్‌సకు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేవని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు.
బేసిన్లూ భేషజాలు లేవని రాజకీయ స్వార్థంతో ఆంధ్ర పాలకులకు వంత పాడిన మాజీ సీఎం: కోదండరాం
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు అర్హత బీఆర్‌ఎ్‌సకు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేవని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. వరద, మిగులు జలాల పేరిట నికర జలాలను తరలించుకు వెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తోందన్న కోదండరాం.. ఈ కుట్రకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజాలు పడ్డాయని చెప్పారు. ఏపీ కుట్రను ఎదుర్కొని తెలంగాణ హక్కులు కాపాడవల్సిన కేసీఆర్.. బేసిన్లు లేవు భేషజాలు లేవని ఆంధ్ర పాలకులకే వంత పాడటం ద్వారా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణనే బలి పెట్టారని ఆరోపించారు.
గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాడకం తక్కువ చేసి చూపి.. అక్రమంగా నీటిపై హక్కు పొందేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని కోదండరాం ధ్వజమెత్తారు. ఏపీ నేరుగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి నివేదించడంతో తెలంగాణ తన అభ్యంతరాలు చెప్పే అవకాశం కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఉల్లంఘించి మరీ పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ శాఖను పరిశీలించడమేమిటని ప్రశ్నించారు. జల వనరుల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన అసమానతలను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా సరి చేసి, రెండు రాష్ట్రాల మధ్య న్యాయ సమ్మతమైన నీటి పంపిణీ జరపాలని కోరారు. గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన నీటి వాటా తేల్చి.. ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jun 21 , 2025 | 03:51 AM