Crime Trends: పత్రికలు, టీవీల్లో 25శాతం నేర వార్తలే..
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:38 AM
దినపత్రికలు, టీవీ చానళ్లలో ప్రతి రోజు 25శాతం నేర వార్తలే ఉంటున్నాయని.. మద్యం, ప్రేమ, భూమి వివాదాలతో జరుగుతున్న నేరాలే అధికమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ అన్నారు.
మానవ సంబంధాల బలోపేతానికి సాహితీవేత్తలు కృషి చేయాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్
సినారె సాహిత్య పురస్కారాల ప్రదానం
భువనగిరి టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దినపత్రికలు, టీవీ చానళ్లలో ప్రతి రోజు 25శాతం నేర వార్తలే ఉంటున్నాయని.. మద్యం, ప్రేమ, భూమి వివాదాలతో జరుగుతున్న నేరాలే అధికమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ అన్నారు. ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన సినారె సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి జస్టిస్ లక్ష్మణ్ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మితిమీరి మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, వివాహేతర సంబంధాలు, ప్రేమ వివాహాలు, భూ కబ్జాలు తదితర కారణాలతో నేరాలు పెరుగుతుండటం శ్రేయస్కరంకాదన్నారు. సాహితీవేత్తలు, కవులు తమ రచనల ద్వారా మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
డబ్బు, పదవులు నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడిని ఆదర్శంగా తీసుకుంటున్న మన దేశంలో 2007లో తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిరోజు ఇలాంటివి 15 కేసులు తన బెంచ్‌పైకి వస్తుండటం మనసును కలచి వేస్తోందని చెప్పారు. కోర్టు తీర్పులను ప్రజలందరూ సులువుగా చదువుకునేలా దేశంలో ఎంపిక చేసిన 17 మాతృభాషల్లో తర్జుమా జరుగుతున్నాయని, ఎంపిక చేసిన 2,200 తీర్పుల తెలుగు అనువాదం 80శాతం పూర్తయిందని, అనువదించిన తీర్పులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ అవార్డు సాధించిన డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు భాష కీర్తిని చాటారని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలుగు సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డితో కలిసి 11 మంది సాహితీవేత్తలకు సినారె సాహిత్య పురస్కారాలను అందజేశారు.
Updated Date - Jul 28 , 2025 | 03:38 AM