Jagga Reddy: ఢిల్లీ టూర్ నన్ను పూర్తిగా మార్చేసింది
ABN, Publish Date - Mar 17 , 2025 | 04:05 AM
ఇటీవల జరిగిన తన ఢిల్లీ టూర్.. తనను పూర్తిగా మార్చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. తాను సినిమా రంగంలోకి వెళ్లేందుకు ఈ టూర్ పనికొచ్చిందన్నారు.
సినిమాల్లోకి వెళ్లేందుకు ఈ టూర్ పనికొచ్చింది
పార్టీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇప్పుడు నా అవసరం లేదు
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధితో పాటు సినిమాపైనా దృష్టి పెడతా
ఉగాది రోజున జగ్గారెడ్డి- ఎ వార్ ఆఫ్ లవ్ సినిమా కార్యాలయాన్ని ప్రారంభిస్తాం
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన తన ఢిల్లీ టూర్.. తనను పూర్తిగా మార్చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. తాను సినిమా రంగంలోకి వెళ్లేందుకు ఈ టూర్ పనికొచ్చిందన్నారు. అయితే సినిమాకు, తన రాజకీయానికి సంబంధం లేదని తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఈ సినిమా ద్వారా రాజకీయాల్లో తాను కొత్తగా తీసుకునే అడ్వాంటేజ్ కూడా ఏమీ లేదని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. మూడు నెలల కిందట తనను కలిసిన డైరెక్టర్ రామానుజం.. సినిమా కథను వినిపించేందుకు సమయం కోరారని చెప్పారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని చెప్పారని అన్నారు. తొలుత ఆ డైరెక్టర్‌కు తాను సమయం ఇవ్వలేననుకున్నానని, అయితే ఆ తర్వాత ఆయన చూపించిన ఫొటోను చూశాక ఆ సినిమాకు కనెక్ట్ అయ్యానని వెల్లడించారు. జగ్గారెడ్డి.. ఎ వార్ ఆఫ్ లవ్ సినిమాను కచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎ వార్ ఆఫ్ లవ్ క్యాప్షన్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారని, అయితే ఈ సినిమాలోని తన పాత్రకు, ప్రేమకు సంబంధం లేదన్నారు.
డైరెక్టర్ తనకు కథను వినిపించే క్రమంలో.. తన జీ వితంలో జరిగిన కొన్ని విషయాలను ఆయనకు చెప్పానన్నారు. విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని మొదలు పెట్టిన తాను.. కౌన్సిలర్ అయిన తీరు.. ఆ తర్వాత మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన విధానాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు పేర్కొన్నారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉం టుందని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ సినిమాపైనా దృష్టి పెడతానని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉంది కా బట్టి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సంగారెడ్డికి ఎక్కువ నిధులు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఇప్పుడు తన అవసరంలేదన్నారు. సినిమాకు సంబంధించిన కార్యాలయాన్ని ఈ ఉగాదికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల కిందట రాసిన పాటను నెల రోజుల్లో విడుదల చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.
Updated Date - Mar 17 , 2025 | 04:06 AM