Facebook Case: ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
ABN, Publish Date - May 30 , 2025 | 10:33 AM
Facebook Case: బంజారాహిల్స్‌లో యువతికి వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని మహేంద్ర వర్థన్ లంచ్‌కు ఆహ్వానించాడు. అతడిని ఎంతగానో నమ్మిన యువతి అక్కడకు వెళ్లింది.
హైదరాబాద్, మే 30: ఫేస్‌బుక్ (Face Book) పరిచయంతో ఎంతో మంది అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని అమ్మాయిలను ప్రేమ పేరుతో మాయ చేసి ఆ తరువాత లైంగిక దాడులకు పాల్పడుతున్నారు కామాంధులు. ఫేస్‌బుక్ పరిచయాలతో జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చిరిస్తున్నప్పటికీ ఏదో విధంగా బలవుతూనే ఉన్నారు యువతులు. తాజాగా ఓ యువతి కూడా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది. లైంగిక దాడితో పాటు లక్షల్లో డబ్బులను చెల్లించుకోవాల్సి వచ్చింది యువతి. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
నగరంలోని బంజారాహిల్స్‌లో యువతికి వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని మహేంద్ర వర్థన్ లంచ్‌కు ఆహ్వానించాడు. అతడిని ఎంతగానో నమ్మిన యువతి అక్కడకు వెళ్లింది. కానీ ఆ తరువాత తాను ఎలాంటి మోసానికి బలవుతుందో ఊహించలేకపోయింది యువతి. లంచ్ కోసం వెళ్లిన యువతి పట్ల సదరు వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు.
యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేశాడు ఓ వ్యక్తి. ఫేస్‌బుక్‌లో ఓ యువతికి మహేంద్ర వర్ధన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలా వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక రోజు యువతిని మహేంద్ర వర్ధన్ లంచ్‌కు ఇన్వైట్ చేశాడు. దీంతో అతడి మాటలు నమ్మి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు మహేంద్ర. ఆ తరువాత ఫోటోలు, వీడియోలు తీసి కొంతకాలంగా యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతామని, ఇంట్లో వాళ్లకు చెబుతామని బెదిరింపులకు దిగాడు.
దీంతో భయాందోళనకు గురైన యువతి దాదాపు రూ.20 లక్షల వరకు నిందితుడికి అప్పజెప్పింది. అయితే అంతటితో ఆగని నిందితుడు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో నిందితుడి వేధింపులతో విసుగెత్తి పోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహేంద్ర వర్ధన్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా ఇది వరకు మహేంద్ర వర్ధన్ ఎంతమంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేశాడనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహేంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 30 , 2025 | 12:04 PM