Hyderabad Road Accident: అతి వేగంతో లారీని ఢీకొన్న కారు
ABN, Publish Date - May 22 , 2025 | 05:04 AM
హైదరాబాద్ హయత్‌నగర్‌లో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారులో ముగ్గురు యువకులు మూల మలుపు వద్ద లారీని ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముగ్గురు యువకుల మృతి
హయత్‌నగర్/అబ్దుల్లాపూర్‌మెట్, మే 21(ఆంధ్రజ్యోతి): అతి వేగం ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. మితిమీరిన వేగంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు మూల మలుపు వద్ద వాహన వేగం నియంత్రించలేక ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. దీంతో ముగ్గురు ఘటనాస్థలిలోనే ప్రాణాలొదిలారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కుంట్లూరుకు చెందిన చుంచు జంగారెడ్డి, చుంచు శ్రీనివా్‌సరెడ్డి అన్నదమ్ములు. జంగారెడ్డి కుమారుడు త్రినాథ్ రెడ్డి(21), శ్రీనివా్‌సరెడ్డి కుమారుడు వర్షిత్ రెడ్డి (20), అదే గ్రామానికి చెందిన పినింటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి (24), కుంట్లూరుకే చెందిన ఎలిమినేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కల్యాణ్ రెడ్డి(24) మంచి స్పేహితులు! మంగళవారం రాత్రి వీరంతా కారులో పెద్ద అంబర్‌పేట్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. భోజనాలయ్యాక కారులో కుటుంబసభ్యులను ఇంట్లో దిగబెట్టారు. తర్వాత వెంటనే వస్తామని ఇంట్లో చెప్పి నలుగురు కలిసి కారులో బయలుదేరారు. రాత్రంతా బయట తిరిగిన యువకులు, తెల్లవారుజామున ఇంటికి బయలుదేరారు. కుంట్లూరు రోడ్డులో ఎల్‌పీజీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు రాగానే ఓ మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో త్రినాథ్ రెడ్డి, వర్షిత్‌రెడ్డి, చంద్రసేనారెడ్డి మృతిచెందారు. పవన్ కల్యాణ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు.
Updated Date - May 22 , 2025 | 05:06 AM