హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. తగ్గేదేలే!
ABN, Publish Date - Jun 12 , 2025 | 02:59 AM
రియల్ ఏస్టేట్ దూకుడులో హైదరాబాద్ మహా నగరం మరోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చేపట్టిన ప్లాట్ల వేలంలో పలికిన ధరలే ఇందుకు నిదర్శనం.
కేపీహెచ్‌బీలో గజం రూ.2.98 లక్షలతో.. కొత్త రికార్డ్
ఏడేళ్ల క్రితం మాదాపూర్‌లో గజం రూ.1.51 లక్షలు
రెండేళ్ల క్రితం కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు!
హైదరాబాద్ సిటీ, జూన్11 (ఆంధ్రజ్యోతి): రియల్ ఏస్టేట్ దూకుడులో హైదరాబాద్ మహా నగరం మరోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చేపట్టిన ప్లాట్ల వేలంలో పలికిన ధరలే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో.. ప్లాట్లను వేలం వేస్తే కొంటారా? లేదా? అనే సందిగ్ధం నడుమ జరిగిన వేలం ప్రక్రియ సూపర్‌డూపర్ హిట్టయింది. అధికారుల అంచనాలకు మించిన ధరలకు ప్లాట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. హౌసింగ్ బోర్డు చదరపు గజానికి నిర్ణయించిన ధర కంటే రెట్టింపు స్థాయిలో ధర పలకడం.. ఒక కమర్షియల్ స్థలం ధర అత్యధికంగా చదరపు గజానికి రూ.2.98 లక్షలు పలకడం విశేషం. హైదరాబాద్ మహా నగరంలో భూములు, స్థలాల వేలమంటే నగరవాసులకే కాదు.. దేశ విదేశాల్లో ఉన్నవారికీ ఆసక్తే. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలంలో దేశ, విదేశాల్లో ఉండేవారు ఆన్‌లైన్‌లో పాల్గొని కొనుగోళ్లు చేసిన దాఖలాలున్నాయి.
రెండేళ్ల క్రితం కోకాపేటలో ఎకరం ధర రూ.100కోట్లకు పైగా పలుకడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారగా.. ఆ తర్వాత నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని మోకిల్లాలో చదరపు గజం లక్షకు పైగా పలుకడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం వాటిని మించిన సంచలనం. రియల్ ఏస్టేట్ వర్గాల్లో ఆశలు రేకెత్తించిన పరిణామమిది. ఎందుకంటే.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటుగా సాగుతున్న స్థలాలు, ప్లాట్ల క్రయ విక్రయాల్లో ధర అధికారికంగా ఖరారు కావడం లేదు. అమీర్‌పేట, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ఇలా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చ.గజం రూ.2.5 లక్షలు, రూ.3 లక్షల వరకూ ఉంటుందని అనడమే కానీ.. ఆయా ప్రాంతాల్లో స్థలాలను అమ్మేందుకు ముందుకు వచ్చేవారు.. కొనేందుకు ఆసక్తి చూపేవారు చాలా అరుదు. తాజాగా కేపీహెచ్‌బీలో జరిగిన ప్లాట్ల వేలంతో అధికారికంగానే ధర ఖరారయినట్టయింది. 2018 ఏప్రిల్ నెలలో హెచ్‌ఎండీఏ వేలం వేస్తే మాదాపూర్‌లో ఓ ప్లాట్ ధర చదరపు గజానికి రూ.1.51 లక్షల చొప్పున పలకగా.. అత్తాపూర్‌లో రూ.1.53 లక్షలు పలికింది. తాజాగా కేపీహెచ్‌బీలో రూ.2.98లక్షలు పలుకడం హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ పడిపోలేదనడానికి నిదర్శనమని, మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Updated Date - Jun 12 , 2025 | 02:59 AM