Vikarabad: భారీ పోలీసు బందోబస్తు మధ్య పులిచర్లకుంట తండాలో భూ సర్వే
ABN, Publish Date - May 02 , 2025 | 06:14 AM
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పులిచర్లకుంట తండాలో గురువారం భారీ భద్రత నడుమ భూ సర్వే చేపట్టారు. చివర్లో కొంతమంది రైతులు తెలియకుండానే సర్వే చేశారంటూ ఆందోళన చేయగా అధికారులు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదించారు.
దుద్యాల, మే 1(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పులిచర్లకుంట తండాలో గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య భూ సర్వే చేశారు. 110 ఎకరాల్లో సర్వే పూర్తి చేశామని తహసీల్దార్ కిషన్ నాయక్ తెలిపారు. చివరిలో కొందరు రైతులు తమకు తెలియకుండా సర్వే చేస్తారా? అంటూ ఆందోళన చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, అధికారులు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలెపల్లి, హకీంపేట్, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా గ్రామాల్లో అసైన్డ్, పట్టా భూముల్లో సర్వే చేసి రైతుల అంగీకారంతో భూములు సేకరించింది. రైతులకు పరిహారం కూడా చెల్లించింది. అయితే రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లో వివాదలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పులిచర్లకుంట తండాకు చెందిన ఒక రైతు ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూమి ఇచ్చాడు. మరికొందరు రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులతో తెలిపారు. దీంతో గురువారం దుద్యాల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలు, ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 06:14 AM