Swagruha: స్వగృహ ఫ్లాట్లు.. హౌసింగ్ ప్లాట్ల వేలానికి సర్కారు పచ్చజెండా
ABN, Publish Date - Jun 08 , 2025 | 04:24 AM
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20 నాటికి రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పరిధిలోని ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను దశలవారీగా వేలం వేయనుంది. మొత్తం రూ.4,000 కోట్లపైగా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టి, ఈ డబ్బుతో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో, ఇతర జిల్లాల్లో హౌసింగ్ పథకాలు చేపట్టాలని భావిస్తోంది.
దశలవారీగా విక్రయానికి మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం.. ఈ నెల 20నాటికి నోటిఫికేషన్లు
4 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చే చాన్స్
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహనిర్మాణ శాఖకు అనుబంధంగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డుల పరిధిలోని ఆస్తుల వేలానికి సర్కారు పచ్చజెండా ఊపింది. రాజీవ్ స్వగృహ టవర్లలోని ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లతోపాటు హౌసింగ్‌బోర్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్లను, ఖాళీ స్థలాలను విక్రయించనుంది. దీనిపై గృహనిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన క్యాబినేట్ సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఆస్తుల వేలానికి సంబంధించి ఈ నెల (జూన్) 20 నాటికి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహ పరిధిలోని ఆస్తుల వేలంతో సుమారు రూ.3,538 కోట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని ఆస్తుల వేలంతో సుమారు రూ.600కోట్లు కలిపి.. రూ.4 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయంతో.. ఔటర్‌రింగ్ రోడ్డు పరిసరాలు, ఇతర జిల్లాల్లో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే హౌజింగ్ పథకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాంతాన్ని బట్టి కనీస ధర నిర్ణయం
రాజీవ్ స్వగృహ పరిధిలో పోచారం, బండ్లగూడ, గాజులరామారం ప్రాంతాల్లో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న టవర్లు, వాటిల్లోని ఫ్లాట్లకు ప్రాంతాన్ని బట్టి అధికారులు కనీస ధరలను ఖరారు చేశారు. బండ్లగూడలో పూర్తయినఅపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు చదరపు అడుగు రూ.3వేలు, అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.2,750చొప్పున ధర నిర్ణయించారు. పోచారంలో పూర్తయిన ఫ్లాట్లకు రూ.2,750, అసంపూర్తి వాటికి రూ.2,250 చొప్పున ధర ఖరారు చేశారు.
వేలం వేయనున్న ఆస్తులు ఇవే..
రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు ఆస్తులను ఒకేసారి కాకుండా దశలవారీగా వేలం వేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో మేడ్చల్-మల్కాజ్‌గిరి, ఖమ్మం జిల్లాలతోపాటు మరో 9 ప్రాంతాల్లో కలిపి 11 చోట్ల ఉన్న ఆస్తులను వేలం వేయనున్నారు. ఈ ఆస్తుల వేలంతో సుమారు రూ.900 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అంచనా.
మేడ్చల్ జిల్లా పరిధిలోని పోచారం (సద్భావన టౌన్‌షి్‌ప)లో 601 ఫ్లాట్లున్నాయి. ఇదే జిల్లా పరిధిలోని గాజులరామారంలో 5 టవర్లు, పోచారంలో 6, ఖమ్మంలో పోలేపల్లి దగ్గర అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని వేలం వేయనున్నారు.
మేడ్చల్ పరిధిలోని బండ్లగూడ (సహభావన టౌన్‌షి్‌ప)లో 159 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో 3బీహెచ్‌కే డీలక్స్ ఫ్లాట్లు 3, 3బీహెచ్‌కే 8, 2బీహెచ్‌కే19, 1బీహెచ్‌కే ఫ్లాట్లు 129 ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని కుర్మలగూడలో 20, చందానగర్‌లో 3, తొర్రూరులో 514, మహబూబ్‌నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్‌లో 45, బహదూర్‌పల్లిలో 69ప్లాట్లు ఉన్నాయి.
హౌసింగ్ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ-4వ ఫేజ్‌లో 7.33 ఎకరాల్లో ఉన్న ఖాళీ భూములు, అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ఫ్లాట్లు (ఒకటి 4,598 చ.గ, రెండోది 2,420 చ.గ).. నాంపల్లిలో ఉన్న 1,148 చదరపు అడుగుల ఖాళీ స్థలం వేలం వేయనున్నారు.
ఆస్తుల కొనుగోలుకు మంచి అవకాశం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు పరిధిలోని ఆస్తుల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.
కేపీహెచ్‌బీ-7లో 11న ప్లాట్ల వేలం
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) ఏడో ఫేజ్‌లోని 17 ప్లాట్లను ఈ నెల 11న బహిరంగ వేలం వేయనున్నారు. ఇందులో 13 వాణిజ్య, నాలుగు నివాస కేటగిరీ ప్లాట్లు ఉన్నాయి. నివాస కేటగిరీకి చదరపు గజానికి రూ.1.25 లక్షలు, వాణిజ్య కేటగిరీకి చదరపు గజం రూ.1.50 లక్షలు కనీస ధరగా నిర్ణయించారు. నివాస కేటగిరీ ప్లాట్ విస్తీర్ణం 194.44 చదరపు గజాలుకాగా.. వాణిజ్య ప్లాట్ల విస్తీర్ణం 151.92 చదరపు గజాల నుంచి 978.92 చ.గజాల వరకు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 04:24 AM